Share News

Doctor : నరాలు దెబ్బతినకుండా...

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:52 AM

టేబుల్‌ మీద మోచేతులు ఆనించి కూర్చుంటాం. పాదాలకు బిగుతైన బూట్లను వేసుకుంటాం. నేల మీద పద్మాసనంలో కూర్చుంటాం. ఇవన్నీ సర్వసాధారణమైన అలవాట్లే! కానీ వీటితో నాడులు దెబ్బతింటాయనే విషయం మనలో ఎంత మందికి తెలుసు?

Doctor : నరాలు దెబ్బతినకుండా...

 • నరాలు దెబ్బతినకుండా...

టేబుల్‌ మీద మోచేతులు ఆనించి కూర్చుంటాం. పాదాలకు బిగుతైన బూట్లను వేసుకుంటాం. నేల మీద పద్మాసనంలో కూర్చుంటాం. ఇవన్నీ సర్వసాధారణమైన అలవాట్లే! కానీ వీటితో నాడులు దెబ్బతింటాయనే విషయం మనలో ఎంత మందికి తెలుసు? నాడుల డ్యామేజీని ఎలా నియంత్రించాలో, ఎలా పసిగట్టి సరిదిద్దుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకుందాం!

ఈ జాగ్రత్తలు పాటించాలి

 • డెస్క్‌ మీద చేతులు పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్లు, ఆ ప్రదేశంలో మెత్తని ప్యాడ్స్‌ ఏర్పాటు చేసుకోవాలి

 • కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ రాకుండా, కంప్యూటర్‌ ముందు పని చేసేటప్పుడు, మణికట్టు, ముంజేయి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

 • ఎక్కువ సమయాల పాటు పద్మాసనంలో కూర్చోకూడదు

 • బిగుతైన బూట్లు వేసుకోకూడదు

 • మోకాలి సర్జరీ తర్వాత బ్యాండేజీలు మరీ బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి.

 • ప్రమాదాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి

 • అవయవాల్లో స్పర్శ ఏమాత్రం తగ్గినా, తిమ్మిర్లు మొదలైనా, బలహీనత

  కనిపించినా వెంటనే వైద్యులను కలవాలి.

మధుమేహం, బిపిల ప్రభావం

మధుమేహానికీ నాడుల డ్యామేజీకి దగ్గరి సంబంధం ఉంది. సాధారణంగా మధుమేహం నిర్థారణ అయ్యే సమయానికే 20ు మేరకు నాడుల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి చేతులు, కాళ్లలోని నాడులు సురక్షితంగా ఉండాలంటే మధుమేహం మీద ఓ కన్నేసి ఉంచాలి. నిర్థారణ అయిన తర్వాత చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. అధిక రక్తపోటు నాడుల మీద నేరుగా ప్రభావం చూపించకపోయినా, రక్తపోటు పెరగడం మూలంగా నాడులకు రక్తప్రసరణ తగ్గి, డ్యామేజీకి గురయ్యే అవకాశాలుంటాయి.

నాడులు టెలిఫోన్‌ తీగల్లాంటివి. ఆ తీగ దెబ్బతింటే శబ్ద ప్రసారాల్లో అంతరాయం ఏర్పడవచ్చు, పూర్తిగా తెగిపోతే, టెలిఫోన్‌ పూర్తిగా మూగబోవచ్చు. నాడులు దెబ్బతిన్నా ఇదే పరిస్థితి. మరీ ముఖ్యంగా అరచేతులు, చేతులు, పాదాలు, కాళ్లకు సంబంధించిన నాడులు దెబ్బతింటే, ఆయా అవయవాలకు మెదడు నుంచి సిగ్నల్స్‌ అందక తిమ్మిరి, మొద్దుబారడం, స్పర్శ కోల్పోవడం, బలహీనత ఆవరించడం లాంటి లక్షణాలు తలెత్తుతాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి లక్షణాలను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పూర్తిగా పని చేయలేని పరిస్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే కంగారు పడిపోయి, వైద్యుల దగ్గరకు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఇలా ఆలస్యం చేయడం వల్ల, చికిత్సతో సరిదిద్దగలిగే నాడీ సమస్య, ఎప్పటికీ సరిదిద్దలేని శాశ్వత సమస్యగా మారిపోయే ప్రమాదం ఉంటుంది.


నాడులు ఎందుకు దెబ్బతింటాయి?

ప్రమాదాలు, ఒరుసుకుపోవడం, రక్తప్రసారం ఆగిపోవడం, మధుమేహం, అధిక రక్తపోటు, రేడియేషన్‌, మెటాస్టాసిస్‌ (నాడులకు కేన్సర్‌ పాకడం) వల్ల నాడులు దెబ్బతింటాయి. రోడ్డు ప్రమాదాల్లో నేల మీద పడిపోయేటప్పుడు, శరీరానికి దెబ్బలు తగలకుండా చేతులను చాపి, అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. చేతులు రోడ్డుకు ఢీకొనడం వల్ల బాహుమూలల్లోని నాడులు దెబ్బతింటాయి. అలాగే చేతులు స్ట్రెచ్‌ అయినా నాడులు దెబ్బతింటాయి. ఇలాంటి ప్రమాదాల్లో నాడులు పూర్తిగా దెబ్బతింటే చేయి మొత్తం బలహీనపడిపోతుంది. పాక్షికంగా దెబ్బతింటే బలహీనత తక్కువగా ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ఫ్రాక్చర్ల సమయంలో కూడా నాడులు దెబ్బతింటూ ఉంటాయి. భుజం మీద పడిపోతే యాక్సిలరీ నాడి దెబ్బతిని చేతిని పైకి లేపలేకపోతారు. టేబుల్‌ మీద మోచేతిని ఆనించి కూర్చునే అలవాటున్న వాళ్లలో మోచేతి దగ్గరి నాడుల మీద ప్రభావం పడుతుంది.

కంప్రెషన్‌ ఇంజురీస్‌

టెండాన్ల మధ్య నుంచి ప్రయాణించే నాడులు ఒత్తిడికి లోనై అవయవాల్లో బలహీనత వస్తుంది. కంప్యూటర్‌ దగ్గర ఎక్కువ సమయాల పాటు పని చేసినా మణికట్టులో నాడి ఒత్తిడికి గురై, కార్పెల్‌ టెన్నల్‌ సిండ్రోమ్‌ అనే సమస్య తలెత్తుతుంది. దాంతో మొదటి మూడు వేళ్లలో తిమ్మిర్లు మొదలవుతాయి. అరచేతులు బలహీనపడతాయి. స్థూలకాయ మహిళల్లో, గర్భిణుల్లో, రుమటాయి ఆర్థ్రయిటిస్‌ ఉన్న వాళ్లలో, మణికట్టుకు దెబ్బ తగిలిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. బిగుతైన బూట్లు వేసుకున్నప్పుడు పాదాల్లోని నాడులు ఒరుసుకుపోతాయి. సర్జరీ తదనంతరం ఎక్కువ సమయాల పాటు మంచానికే పరిమితమైన వాళ్లలో మోకాలి అడుగు భాగం బెడ్‌కు తగులుతూ ఉండడం మూలంగా కాళ్లలో నాడులు దెబ్బతిని ఫుట్‌ డ్రాప్‌ సమస్య తలెత్తుతుంది. ఎక్కువ సమయాల పాటు పద్మాసనంలో కూర్చునే వాళ్లలో కూడా కాళ్లలోని నాడులు దెబ్బతింటాయి. ఇవన్నీ కంప్రెషన్‌ న్యూరోపతీ సమస్యలు.

నాడుల డ్యామేజీని ఇలా గుర్తించాలి

 • దెబ్బ తిన్న నాడికి సంబంఽధించిన అవయవంలో స్పర్శ తగ్గుతుంది.

 • దెబ్బతిన్న నాడికి సంబంధించిన కండరాలు బలహీనపడి, అవయవ బలహీనత తలెత్తుతుంది

 • తిమ్మిర్లు రావచ్చు

 • కదలికలు తగ్గుతాయి


డ్యామేజీలు పలు రకాలు

నాడులు దెబ్బతినకుండా వాటిని ఆక్సాన్స్‌ అనే నర్వ్‌ ఫైబర్లు, మెంబ్రేన్స్‌ కాపాడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా నాడులను కాపాడలేకపోతాయి. అలాంటప్పుడు నాడులు దెబ్బతింటూ ఉంటాయి. సాగడం, ఒరుసుకుపోవడం, తెగిపోవడం... ఇలా మూడు రకాలుగా నాడులు దెబ్బతింటూ ఉంటాయి. కొన్నిసార్లు నాడులు చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, వాటి పనితీరు దెబ్బ తింటూ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల లోపు ఈ సమస్య దానంతట అదే సర్దుకుంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో నాడి యాక్సాన్‌ దెబ్బతిని, కవరింగ్స్‌ మెరుగ్గానే ఉంటాయి. ఈ సమస్య కూడా దానంతట అదే పరిష్కారమైపోతంది. కానీ నర్వ్‌ స్ట్రక్చర్‌ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు సర్జరీ ద్వారా టెండాన్‌ ట్రాన్ఫర్‌, నర్వ్‌ గ్రాఫ్టింగ్‌, రక్త సరఫరాను పునరుద్ధరించడం లాంటివి చేయవలసి ఉంటుంది. కానీ సర్జరీ ఫలితం 50 నుంచి 60 శాతమే ఉండవచ్చు. పెద్దలతో పోల్చుకుంటే,

యుక్తవయస్కుల్లో ఫలితం మెరుగ్గా ఉంటుంది. అలాగే గాయపడిన నాడులకు ఎంత త్వరగా సర్జరీ చేయగలిగితే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. రోగి వయసు, గాయం తీవ్రత, చికిత్సను ఆశ్రయించిన సమయాల మీద కూడా సర్జరీ ఫలితం ఆధారపడి ఉంటుంది.

వెన్ను దెబ్బతింటే....

వెన్నుపాము దెబ్బతింటే రెండు చేతులు, రెండు కాళ్ల మీద ప్రభావం పడవచ్చు. వెన్నుపాములో సగభాగం దెబ్బతింటే, ఒక వైపు కాలు, చేయి మీద ప్రభావం పడవచ్చు. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో వెన్నుపాముకు దెబ్బ తగిలినప్పుడు, వెన్నుపాము లోపలే రక్తం గడ్డకట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో వెన్నుపూసల మధ్య నాడులు ఒరిపిడికి గురి కావచ్చు. దాంతో అవయవాల్లో బలహీనత తలెత్తుతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా సమస్య తీవ్రత మీదే సర్జరీల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

పిల్లలను ఇలా ఎత్తుకోవాలి

ప్రసవం క్లిష్టంగా మారిన సమయంలో బిడ్డ చేతులు పట్టుకుని బయటకు లాగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు బిడ్డ బాహుమూలల్లోని నాడులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య బిడ్డ పెరిగే క్రమంలో చేతులు బలహీనపడడం ద్వారా బయల్పడుతూ ఉంటుంది. అలాగే చిన్న పిల్లలను ఎత్తుకునేటప్పుడు బాహుమూలల్లో అర చేతులు ఉంచి, పైకి లేపాలి. అంతే తప్ప మోచేతులు, ముంజేతుల దగ్గర పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేసినా, పిల్లల బాహుమూలల్లోని నాడులు దెబ్బతిని, చేతులు బలహీనపడిపోయే ప్రమాదం ఉంటుంది.

డాక్టర్‌ ఆర్‌. ఎన్‌. కోమల్‌ కుమార్‌

సీనియర్‌ న్యూరాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.

Updated Date - Jun 11 , 2024 | 01:14 AM