Share News

Sandeshkhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షేక్ షాజహాన్ అరెస్ట్

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:37 AM

సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత షేక్ షాజహాన్‌ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Sandeshkhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షేక్ షాజహాన్ అరెస్ట్

కోల్‌కతా: సందేశ్ ఖాళీలో (Sandeshkhali) మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌ను (Sheikh Shahjahan) ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర 24 పరగణ జిల్లా మినాఖాలో ఓ ఇంట్లో దాక్కొని ఉన్న షాజహాన్‌ను (Shahjahan) గురువారం తెల్లవారు జామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే బసిర్హత్ కోర్టులో హాజరు పరిచామని మీడియాకు పోలీసులు తెలిపారు.

ఏం జరిగిందంటే..?

షేక్ షాజహాన్, అతని అనుచరులు సందేశ్ ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం తీవ్ర కలకలం రేపింది. ఆ స్కామ్‌నకు సంబంధించి జనవరి 5వ తేదీన విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాజహాన్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు అధికారులపై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత షాజహాన్ పారిపోయాడు. ఆ ఘటన తర్వాత షాజహాన్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. షాజహాన్‌ను పోలీసులే కాకుండా దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయొచ్చని ఆదేశాలు జారీచేసింది.

టీఎంసీ వర్సెస్ బీజేపీ

షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని అధికార టీఎంసీ స్వాగతించింది. హైకోర్టు కలుగజేసుకోవడంతో షాజహాన్ అరెస్ట్ జరిగిందని పేర్కొంది. గత నెలరోజులకు పైగా సందేశ్ ఖాలీలో అశాంతికి కారణం షాజహాన్ అని, అతని అరెస్ట్‌తో ఇప్పుడు పరిస్థితి సద్దుమణగనుందని అభిప్రాయ పడింది. టీఎంసీ కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. షాజహాన్ అరెస్ట్‌‌తో ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఇప్పుడు షాజహాన్ పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టంగా ఉన్నారని మండిపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 11:01 AM