Share News

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ.. ఒకవేళ డీల్ కుదరకపోతే..

ABN , Publish Date - Feb 19 , 2024 | 12:59 PM

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది.

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ.. ఒకవేళ డీల్ కుదరకపోతే..

లక్నో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది. కూటమి నుంచి మమతాబెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో గల అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో కూడా కాంగ్రెస్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకుగాను 15 స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్పీ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తమ నిర్ణయాన్ని తెలియచేసినట్టుగా తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది.


ఈశాన్య లేదా హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్లు చాలా తక్కువగా వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక రాయ్‌బరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథీలో సైతం స్మృతి ఇరానీ చేతిలో ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అమేథీ, రాయ్‌బరేలీలో ఎస్పీ పోటీకి దూరంగా ఉంది. గత ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కు ఎదురైన ఘోరపరాజయం నేపథ్యంలోనే ఈ సారి ఆ పార్టీకి ఎస్పీ 15 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇక బంతి కాంగ్రెస్ కోర్టులోనే ఉంది. దీంతో ఎస్పీ ఆఫర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తమ ఆఫర్‌కు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోతే సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇండియా కూటమి నుంచే వైదొలిగే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 21 నుంచి 22 సీట్లు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ముస్లిం మైనారిటీ నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం. యూపీలో జరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొంటారా? లేదా? అనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంపై తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర 37వ రోజుకు చేరుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 12:59 PM