Share News

IndiGo: ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. సీట్ల ఎంపిక చార్జీలు భారీగా పెంపు

ABN , Publish Date - Jan 09 , 2024 | 09:19 AM

భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.

IndiGo: ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. సీట్ల ఎంపిక చార్జీలు భారీగా పెంపు

ముంబై: భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది. అంటే ఒక్కసారిగా రూ.500 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండిగో విమానయాన సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. దాని ప్రకారం 232 సీట్లు ఉండే ఏ321 విమానంలో మొదటి వరుసలోని విండో సీటు ఎంచుకోవాలంటే రూ.2,000 చెల్లించాల్సిందే. అదే వరుసలో మధ్య సీటును ఎంపిక చేసుకుంటే రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. 222 సీట్లు గల ఏ321, 186 సీట్లు గల ఏ320, 180 సీట్లు గల ఏ320 విమానాల్లో కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. ఏటీఎర్ విమానాల్లో అయితే సీట్ల ఎంపిక కోసం రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.


ఏవియేషన్ విశ్లేషకులు అమేయ జోషి మాట్లాడుతూ.. ‘‘విమానంలో అదనపు లెగ్‌రూమ్‌తో ముందు వరుస సీట్ల ఎంపిక ఛార్జీని ఇండిగో గరిష్టంగా రూ.2000 వరకు పెంచింది. గతంలో ఇది రూ.1500గా ఉండేది.’’ అని చెప్పారు. కాగా సీట్ల ఎంపిక ఛార్జీలను రూ.2,000కు పెంచడంపై ఇండిగో ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే ఇతర వరుసలలో సీట్లను ఎంచుకోవడానికి ఛార్జీలలో మార్పుల గురించి కూడా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. సాధారణంగా విమానాల్లో అదనపు ఫీచర్లతో కూడిన సీట్లను ఎంచుకునే అవకాశాలను ప్రయాణికులకు కల్పిస్తారు. ఇందుకుగాను వారి నుంచి విమానయాన సంస్థలు ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. దీనిని విమానయాన సంస్థలు ఆదాయ ఉత్పత్తిగా వినియోగించుకుంటున్నాయి. కాగా ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఇండిగో విమానయాన సంస్థ గత వారం ఉపసంహరించుకుంది. దీంతో దూర ప్రాంతాలకు సంబంధించిన విమాన ఛార్జీలు రూ.1,000 వరకు తగ్గనున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరిగిన తర్వాత ఇంధన ఛార్జీని అక్టోబర్ 2023లో ప్రవేశపెట్టారు. ఏటీఎఫ్ ధరలను ఇటీవల తగ్గించడంతో ఇండిగో ఛార్జీలను ఉపసంహరించుకుంది. సాధారణంగా ఇంధన ఛార్జీల ధరలు దూరాన్ని బట్టి రూ.300 నుండి రూ.1,000 వరకు మారుతూ ఉంటాయి.

Updated Date - Jan 09 , 2024 | 09:19 AM