Share News

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

ABN , Publish Date - Mar 30 , 2024 | 05:45 AM

తమిళనాట జరగనున్న తొలివిడత లోక్‌సభ ఎన్నికల్లో పాలక పక్షం డీఎంకేతో పోటీపడేలా బీజేపీ వ్యూహ రచనలు చేసింది. డీఎంకే కూటమిలో పాతమిత్రపక్షాలే కొనసాగాయి. సినీనటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీ ఆ కూటమిలో చేరినా దానికి సీట్లివ్వలేదు. ఆ పార్టీకి వచ్చే ఏడాది

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

  • డీఎంకేకు దీటుగా బీజేపీ వ్యూహాలు..

  • తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

  • అన్నాడీఎంకేకు ఎదురవుతున్న పెను సవాళ్లు

  • గత చరిత్రకు భిన్నంగా రెండాకులు ఢీలా

(చెన్నై-ఆంధ్రజ్యోతి)

తమిళనాట (Tamil Nadu) జరగనున్న తొలివిడత లోక్‌సభ ఎన్నికల్లో పాలక పక్షం డీఎంకేతో పోటీపడేలా బీజేపీ వ్యూహ రచనలు చేసింది. డీఎంకే కూటమిలో పాతమిత్రపక్షాలే కొనసాగాయి. సినీనటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీ ఆ కూటమిలో చేరినా దానికి సీట్లివ్వలేదు. ఆ పార్టీకి వచ్చే ఏడాది రాజ్యసభ సీటు కేటాయించేలా డీఎంకే ఒప్పందం చేసుకుంది. ఈమేరకు డీఎంకే కూటమి అభ్యర్థులకు కమల్‌ ప్రచారం చేయనున్నారు. డీఎంకేతో పోటీపడేలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో అన్నాడీఎంకే వెనకపడింది. డీఎంకే కూటమిని తలదన్నే లా మెగా కూటమిని ఏర్పాటు చేస్తామన్న పళనిస్వామి ప్రకటన కార్యరూపందాల్చలేదు. అదేసమయంలో బీజేపీ.. వన్నియార్ల ఓటు బ్యాంకు మెండుగా ఉన్న పాట్టాలిమక్కల్‌ కట్చితో పొత్తుపెట్టుకుంది. సినీనటుడు శరత్‌కుమార్‌ నాయకత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి పార్టీని బీజేపీలోవిలీనం చేసుకుంది. అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌, మాజీ సీఎం పన్నీర్‌సెల్వంలతోనూ బీజేపీ పొత్తుపెట్టుకుంది. ప్రధాని మోదీ సేలం సభలో పాల్గొనడానికి ముందే ఇవన్నీ జరిగాయి.

ఇక తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఎన్నిక ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో అన్నాడీఎంకే ముందంజలో ఉండేది. పొత్తులు, మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు, ఏనియోజకవర్గాలు ఇవ్వాలి? అనే విషయాలపై అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌, ఆయన రాజకీయ వారసురాలు జయలలిత వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు. జయలలిత మరణం తర్వాత సీఎం అయిన పళనిస్వామి కూడా గత మూడేళ్లుగా ఆమెలాగే వేగం గా నిర్ణయాలు తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తువల్ల బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టడంలో చాకచక్యం గా వ్యవహరించారు. పార్టీలో ఏకనాయకత్వం అవసరమని, తానే ప్రధాన కార్యదర్శినంటూ సమన్వయకర్తగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వంను దూరంగా పెట్టారు. పార్టీ వ్యవహారాల్లో, న్యాయపోరాటాల్లో విజయం సాధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీపై ఆధిపత్యం సంపాదించుకోగలిగారు. అలాం టి ఆయన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం పట్ల పార్టీ నేతలే దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకూటమి నుంచి వైదొలగే నిర్ణయం తీసుకున్న పళనిస్వామి లోక్‌సభ ఎన్నికల్లో వన్నియార్ల ఓటు బ్యాంక్‌ కలిగిన పీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంలో జాప్యంచేశారని చెబుతున్నారు.

అదేసమయంలో బీజేపీ సుడిగాలిలా పీఎంకేను చుట్టేసింది. ఎక్కువ సీట్లిస్తామనే హామీతోపాటు అవసరమైతే అన్బుమణికి మంత్రి పదవిచ్చేందుకు సిద్ధమేనని ప్రకటించింది. దీం తో పీఎంకే నేతలు రాందాస్‌, అన్బుమణి బీజేపీ కూటమిలో చేరారు. ఈ పరిణామం పళనిస్వామికి దిగ్ర్భాంతి కలిగించింది. చిన్నాచితకా పార్టీలతో పొత్తును ఖరారు చేసుకున్న పళనిస్వామి డీఎండీకేను కూటమిలో చేర్చుకోవటంలో సఫలీకృతులయ్యారు. ఏపార్టీతో పొత్తు కుదుర్చుకోవాలో గురువారం చెబుతానన్న డీఎండీకే నాయకురాలు ప్రేమలతతో చర్చించి ఒకరోజు ముందే పొత్తుపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మెగా కూటములు తలపడాల్సి ఉండగా..బీజేపీ సృష్టించిన రాజకీయ తుఫానులో పరిస్థితులు మారాయి. ఈసారి డీఎంకే మెగా కూటమితో బీజేపీ మెగా కూటమి తలపడే పరిస్థితి నెలకొంది.

Updated Date - Mar 30 , 2024 | 08:24 AM