Share News

UP: ఆ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్.. గెలుపోటములను నిర్ణయించేది అవేనా

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:18 AM

సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల దృష్టి ఆ 120 నియోజకవర్గాల మీదే పడిందా. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు.

UP: ఆ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్.. గెలుపోటములను నిర్ణయించేది అవేనా

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల దృష్టి ఆ 120 నియోజకవర్గాల మీదే పడిందా. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి కొన్ని రోజుల్లో ఈసీ లోక్ సభ ఎన్నికల(Parliament Elections 2024) తేదీలను ప్రకటించవచ్చు. బిహార్‌లోని 40 పార్లమెంటు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారనుంది. వీటిల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటిచేత్తో ఘన విజయం సాధించింది.

అయితే ఈ సారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రంగంలోకి దిగి భారత్ జోడో న్యాయ్ యాత్రతో శ్రేణుల్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. బిహార్ సీఎం నితీశ్ ఇప్పటికే ఇండియా కూటమి నుంచి వైదొలిగారు. కూటమి నుంచి ఒక్కొక్కరూ దూరమవుతున్న సమయంలో రాహుల్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఆయన బిహార్‌లో పర్యటిస్తున్నప్పుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌‌తో కలిసి నడిచారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు కాస్తంత ఉపశమనం ఇచ్చింది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం రాహుల్‌ యాత్రలో కలిసి నడిచే అవకాశం ఉంది.


రాహుల్, అఖిలేష్, తేజస్వీ.. ఈ ముగ్గురు యువ నేతల పార్టీలు బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో మంచి ఓట్ షేర్ కలిగి ఉన్నాయి. అయితే దేశ ప్రజల దశాబ్దాల కల.. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తరువాత బీజేపీ గ్రాఫ్ పెరిగిందని నిపుణులు అంటున్నారు. అలాంటి చోట ప్రతిపక్ష నేతలు ఏమేర ప్రభావం చూపుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములు శాసించే స్థానాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి.

2019 లెక్కలివే..

2019లో రెండు రాష్ట్రాల్లో 120 సీట్లకు గాను ఎన్డీయే 101 స్థానాల్లో విజయం సాధించింది. ఆ సమయంలో, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్ వాదీ పార్టీ చేతులు కలిపి 15 స్థానాలు గెలుచుకున్నారు. అయితే మాయావతి ఈసారి ఎస్పీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమిలో కొనసాగుతాం అంటూనే.. అఖిలేష్ ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించడం కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

2019లో యూపీ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమికి 38% ఓట్లు వచ్చాయి. వీరు 15 స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ బీజేపీ దాదాపు 50% ఓట్లు సాధించింది. 80 స్థానాలకు గానూ 62 స్థానాలను ఎన్డీయే గెలుచుకుంది. బీహార్‌లో 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకుని ఎన్డీయే చరిత్ర తిరగరాసింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ అసలు ఖాతానే తెరవలేదు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 11:04 AM