Share News

Crime News: విజయోత్సవ ర్యాలీలో కాల్పుల మోత.. చిగురుటాకులా వణికిపోయిన అగ్రరాజ్యం..

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:31 PM

తుపాకుల మోతతో అమెరికా మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. కాల్పులతో ఉలిక్కిపడింది. ‘సూపర్ బౌల్’ టోర్నీ విన్నర్ కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో ఈ కాల్పుల ఘటన జరిగింది.

Crime News: విజయోత్సవ ర్యాలీలో కాల్పుల మోత.. చిగురుటాకులా వణికిపోయిన అగ్రరాజ్యం..

తుపాకుల మోతతో అమెరికా మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. కాల్పులతో ఉలిక్కిపడింది. ‘సూపర్ బౌల్’ టోర్నీ విన్నర్ కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఒకరు మృతి చెందగా 21 మందికి గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాల్పులు జరుగుతున్న సమయంలో జట్టు అభిమానులు కొందరు నిందితుడిని ధైర్యంగా ఎదిరించారు. పారిపోతున్న అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కాల్పులు జరుపుతున్న వ్యక్తిని కొందరు అభిమానులు వెంబడించి మరీ పట్టుకోవడాన్ని చూడవచ్చు. అతడిని నేలపై పడేసి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదంతం తమ దృష్టికి వచ్చిందని, ఆ వీడియోను తామూ పరిశీలిస్తున్నట్టు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ తెలిపారు.


కాల్పుల ఘటనలో ఇప్పటికే ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ఘటనతో ఈ ఏడాది అమెరికాలో మొత్తం కాల్పుల ఘటనలు 49కి చేరాయి. ఇలాంటి ఘటనలు చాలా ఆందోళనకరమైనవని, ఇంకా ఇలాంటివి జరుగుతున్నందుకు మనం సిగ్గుపడాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠినమైన తుపాకీ నియంత్రణ చర్యలను అమలు చేయాలని కోరారు. తాజా ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 01:31 PM