Share News

Hyderabad: మీరు ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా.. అయితే.. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..

ABN , Publish Date - Jun 11 , 2024 | 09:58 AM

కాలేజీలో ఫంక్షన్‌ అయినా.. పబ్‌ల్లో పార్టీ అయినా.. మాల్స్‌లో కార్యక్రమాలైనా ఇటీవలి కాలంలో ఎనర్జీ డ్రింక్స్‌(Energy drinks)ను ఫ్రీగా అందుబాటులో ఉంచుతున్నారు. ఉచితంగా వస్తుండడంతో చాలామంది వీటిని ఒకటి కంటే ఎక్కువగానే తాగేస్తున్నారు.

Hyderabad: మీరు ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా.. అయితే.. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..

- ఎనర్జీ డ్రింక్స్‌తో గుండె జబ్బులు రావచ్చు..

- యూఎస్‏లోని మాయో క్లినిక్‌ అధ్యయనంలో వెల్లడి

- కెఫిన్‌తో పాటుగా టౌరీన్‌, గౌరానా వంటి పదార్థాలు ఉండటమే కారణం

- నిద్రకూ భంగమేనంటున్న మరికొన్ని అధ్యయనాలు

- ఉచితంగా ఇచ్చినా తాగొద్దంటున్న డాక్టర్లు

హైదరాబాద్‌ సిటీ: కాలేజీలో ఫంక్షన్‌ అయినా.. పబ్‌ల్లో పార్టీ అయినా.. మాల్స్‌లో కార్యక్రమాలైనా ఇటీవలి కాలంలో ఎనర్జీ డ్రింక్స్‌(Energy drinks)ను ఫ్రీగా అందుబాటులో ఉంచుతున్నారు. ఉచితంగా వస్తుండడంతో చాలామంది వీటిని ఒకటి కంటే ఎక్కువగానే తాగేస్తున్నారు. ఇకపై అలా తాగేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే! ఎందుకంటే ఈ కెఫినేటెడ్‌ ఎనర్జీ డ్రింక్‌ల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని మయో క్లినిక్‌ అధ్యయనంలో తేలింది. ఈ ఎనర్జీ డ్రింక్‌ల వల్ల గుండె లయ తప్పడం జరిగే అవకాశాలున్నాయని ఈ నివేదిక చెబుతున్నది. కెఫిన్‌ కంటెంట్‌తో పాటుగా దీనిలోని ఇతర పదార్థాలు కూడా సమస్యకు కారణమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒక ఎనర్జీ డ్రింక్‌ బాటిల్‌లో 80 మిల్లీ గ్రాముల నుంచి 300మిల్లీ గ్రాముల వరకు కెఫిన్‌ ఉంటుందని, అదే సమస్యలకు కారణమవుతున్నదని హెచ్చరిస్తున్నారు. జర్నల్‌ హార్ట్‌ రిథమ్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. 5శాతం మంది రోగులలో గుండె సమస్య రావడానికి ముందు ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్‌ తాగి ఉంటారని పేర్కొంది. అయితే నేరుగా సంబంధం ఉందని చెప్పలేం కానీ, కాస్త అప్రమత్తత అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ. 2 లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలి: సీపీఎం


సాఫ్ట్‌ డ్రింక్స్‌లా తాగేస్తున్నారు..

చాలామంది ఎనర్జీ డ్రింక్స్‌ను కూడా సాఫ్ట్‌డ్రింక్స్‌ లాంటివిగానే భావిస్తున్నారు. కొంతమందికి ఇది ఎడిక్షన్‌గా కూడా మారుతుందని చెబుతున్నారు. వీటిలో షుగర్‌ కంటెంట్‌ ఎక్కువన్నది నిజమే అయినా కెఫిన్‌, గౌరానా, గ్లుకురోనోలాక్టోన్‌, టౌరిన్‌, జిన్‌సెంగ్‌, ఇనోసిటాల్‌ తదితర పదార్థాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. కెఫిన్‌ స్టిమ్యులెంట్‌గా పనిచేస్తోందని, దీనితో పాటుగా ఇతర కెమికల్స్‌ వల్ల అతి తక్కువ సమయంలో శరీరానికి ఎనర్జీ అందుతుందని చెబుతున్నారు. మనదేశంలో అమ్మే 25కు పైగా ఎనర్జీ డ్రింక్స్‌లో నిబంధనలకంటే ఎక్కువగానే కెఫిన్‌ ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఓ కప్పు కాఫీలో ఉండే 80మిల్లీగ్రాములకు సమానంగా తమ కాన్‌లలో కూడా కెఫిన్‌ ఉంటుందని పలు కంపెనీలు వాదిస్తున్నాయి. ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవటం వల్ల స్టామినా పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ డ్రింక్స్‌ తీసుకుంటున్న టీనేజర్లలో ఆందోళన, ఏకాగ్రత లేకపోవటం వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతుండటం గమనార్హం. ఈ ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకుంటున్న చిన్నారుల్లో మొదట్లో కాస్త ఎనర్జీ కనబడినా తరువాత కాలంలో నిద్రలేమి వంటి సమస్యలు కూడా వెంటాడే అవకాశాలున్నాయని పలువురు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ మాత్రం.. చిన్నారులు, కౌమారదశ పిల్లలు, టీనేజర్లు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నది.

city1.2.jpg


లిమిట్‌ దాటితేనే సమస్యంతా..!

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఈ-కామర్స్‌ కంపెనీలు హెల్త్‌ డ్రింక్‌ అనో ఎనర్జీ డ్రింక్‌ అనో పాల ఉత్పత్తుల ఆధారిత పానీయాలు, మాల్ట్‌ ఆధారిత పానీయాలను రిఫర్‌ చేయవద్దని కోరింది. 2011లో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ రెగ్యులేషన్‌ నూతన ప్రమాణాలను అనుసరించాలని నిర్దేశించింది. కెఫిన్‌ ఇంటాక్సినేషన్‌ వల్ల హార్ట్‌రేట్‌ ఒక్కసారిగా పెరగటం, యాంగ్జైటీ, వికారం, వాంతులు వంటివి కూడా కావొచ్చని చెబుతున్నారు. ఉచితంగా అందిస్తున్నారని తాగొద్దని, తాగేముందు ఒకటికి రెండుసార్లు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 10:40 AM