Share News

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.. పంద్రాగస్టులోపే రుణమాఫీ

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:21 PM

చక్కెర ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది అని సీఎం రేవంత్ అన్నారు. నిజామాబాద్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.. పంద్రాగస్టులోపే రుణమాఫీ
CM Revanth Reddy

నిజామాబాద్: చక్కెర ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) స్పష్టం చేశారు. నిజామాబాద్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వ్యవసాయ మంత్రి అవుతారని పేర్కొన్నారు. కేంద్రంలో ఉండే పెద్దలను ఒప్పించి మంత్రి పదవి ఇప్పిస్తానని స్పష్టం చేశారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ ఇస్తామని, బాసర సరస్వతీ మాత మీద ఒట్లు వేసి మరి చెప్పారు. వరి పంటకు రూ.500 బోనస్ అందజేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 2021 జనవరి 30న రైతు సమస్యలపై ఆర్మూర్‌లో చేపట్టిన దీక్ష తర్వాతే నాకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని వివరించారు. ఆరునూరైనా సరే సెప్టెంబర్ 17 లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీనిచ్చారు.


‘2014లో నిజామాబాద్ నుంచి కవిత గెలిచాక రైతులను పట్టించుకోలేదు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి కవిత మాట తప్పారు. అందుకే ఈ ప్రాంత రైతులు కవితను రాజకీయ సమాధి చేశారు. అర్వింద్‌ కూడా మాట తప్పారు. పసుపు బోర్డు ఎక్కడ పెడతారో జీవోలో చెప్పలేదు. స్పైసిస్ ఆఫీస్ తెచ్చి పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో రైతులకు తెలుసు. పంజాబ్, హర్యానా రైతులతో సమానంగా ఆత్మ గౌరవంతో బతికే వారు నిజామాబాద్, ఆర్మూర్ రైతులు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిగా చేస్తారు. కేంద్ర పెద్దలను ఒప్పించి మెప్పించి ఈ మంత్రి పదవి ఇప్పిస్తా అని’ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


‘ఒక్కోసారి ఓటమి కూడా గెలుపునకు నాంది అవుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులతో నన్ను నిర్బంధించారు.. ఓడించారు. తిరిగి మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచాను. అప్పుడు ఓడిపోయినందునే ఇప్పుడు సీఎం వరకు ఎదిగాను. జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలుస్తాడు. కవిత గురించి మాట్లాడేది ఏమీ లేదు.. అంతా మీకు తెలుసు అని’ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


‘ప్రధాని మోదీ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటున్నారు. ఓడిపోతామనే భయంతో మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు. హిందువుల ఆస్తులు గుంజుకుని ముస్లింలకు పంచుతామని అంటున్నారు. ఇది సాధ్యమా? ఇలాంటి చట్టాలు దేశంలో లేవు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి. మత సామరస్యం కాపాడాలనేది మన సంప్రదాయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమి గెలిస్తే దేశానికి మంచిది. బాసర సరస్వతీ మాత మీద ఒట్టేసి చెబుతున్నా.. 15 ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న ఈ గడ్డ. జీవన్ రెడ్డిని గెలిపించి ఓ రైతును పార్లమెంటు కు పంపాలని వేడుకుంటున్నా అని’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 04:43 PM