Share News

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

ABN , Publish Date - Apr 22 , 2024 | 07:47 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి..

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో (Attack On YS Jagan) ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి నిందితులిద్దరినీ కోర్టులో ఒకేసారి ప్రవేశపెడతారని సమాచారం లీక్‌ చేశారు. కానీ, సతీష్‌ను మాత్రమే కోర్టులో హాజరుపరిచారు. దుర్గారావును సోమవారం కోర్టులో హాజరుపరుస్తారని భావించారు. అదేరోజు సతీష్‌ను విచారించడానికి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగానే పోలీసులు ట్విస్ట్‌ ఇచ్చారు. దుర్గారావును ఇంటికి పంపేశారు. కేసు వాదించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన న్యాయవాది అబ్దుస్‌ సలీం.. దుర్గారావు ఆచూకీ చెప్పకపోతే హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేస్తానని చెప్పడంతో పోలీసులు అతడిని ఇంటికి పంపేశారన్న వాదన వినిపిస్తోంది.


Stone-Peltining-On-YS-Jagan.jpg

కావాలనే చెప్పించారా..?

దుర్గారావును విడుదల చేయడంతో ఏ2 ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను కోర్టులో హాజరుపరిచినప్పుడు సమర్పించిన రిపోర్టు రిమాండ్‌లో ఏ2 ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అనుమానంతో తీసుకెళ్లిన దుర్గారావును ఇంటికి పంపడంతో అసలు ఏ2పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున సతీష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగా, అదేరోజు సాయంత్రం దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు. సీసీఎస్‌లో ఇద్దరినీ విచారణ చేశారు. సతీష్‌కుమార్‌ను విచారించాక అతడు వెల్లడించిన అంశాలతో దుర్గారావుపై ప్రశ్నలను సంధించారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గారావు చెప్పడంతో సతీష్‌ను అతడి ముందుకు తీసుకొచ్చారు. దుర్గారావు చెప్తేనే తాను రాయి విసిరానని సతీష్‌ చెప్పాడు. దీనిపై అతడు పోలీసుల సమక్షంలోనే అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన పేరును చెప్పిన సతీష్‌.. చివర్లో పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి ముఖం తిప్పేసుకున్నాడని దుర్గారావు చెబుతున్నాడు. పోలీసులు తనను రెండు రోజులు కొట్టారని, సతీష్‌, తాను ఒకే కాలనీకి చెందిన వాళ్లమే అయినా తమ మధ్య ఎలాంటి పరిచయం లేదంటున్నాడు. తమ ఇద్దరి మధ్య ఉన్నది ముఖ పరిచయం మాత్రమేనంటున్నాడు. సీసీఎస్‌లో విచారించిన తర్వాత తనను మైలవరంలోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి తీసుకెళ్లారని, అక్కడి నుంచి శనివారం సాయంత్రం తీసుకొచ్చి ఇంటికి పంపారని దుర్గారావు వెల్లడించాడు.


Stone-Pelting-Case.jpg

న్యాయవాదిని కలిసిన దుర్గారావు కుటుంబం

పోలీసుల అదుపులో నుంచి ఇంటికి చేరుకున్న దుర్గారావు న్యాయవాది అబ్దుస్‌ సలీంను ఆదివారం కలిశాడు. కుటుంబ సభ్యులతో కలిసి మురళీ ఫార్చ్యూన్‌ వీధిలో ఉన్న న్యాయవాది ఇంటికి వెళ్లాడు. పోలీసులు ఖాళీ కాగితాలపై తనతో, తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకున్నారని వివరించాడు. దీనిపై భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఉన్నట్టా.. లేనట్టా!

సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి కేసులో అసలు నిందితులు ఎంతమంది? రిమాండ్‌ రిపోర్టులో ఏ2 ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందన్న పోలీసులు ఆ ఏ2 ఎవరో ఎందుకు చెప్పట్లేదు..? అసలు ఈ కేసులో రెండో నిందితుడు ఉన్నట్టా లేనట్టా?.. ఇప్పటికే అనేక మలుపులు తీసుకున్న గులకరాయి కేసు తాజాగా మరిన్ని సందేహాలను తెరపైకి తెచ్చింది.

ycp.jpg

సీఆర్పీసీ 164పై నేడు విచారణ

సీఆర్పీసీలోని 164 ప్రకారం ప్రధాన నిందితుడు సతీష్‌కుమార్‌ వాంగ్మూలం ఇప్పించాలని పోలీసులు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఇప్పటికే సతీష్‌కుమార్‌.. 161 ప్రకారం వాంగ్మూలం ఇచ్చాడు. ఇది న్యాయస్థానంలో ఉంది. ఒకవేళ 164 ప్రకారం వాంగ్మూలం నమోదు చేయడానికి న్యాయాధికారి అంగీకరిస్తే, సతీష్‌కుమార్‌ నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయన్న చర్చ నడుస్తోంది. ఇంటికి చేరుకున్న దుర్గారావు తన పేరును సతీష్‌తో పోలీసులు బలవంతంగా చెప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనతో దుర్గారావుకు సంబంధించిన లింకులు దొరక్కపోవడంతో ఇంటికి పంపినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా విచారణ పేరుతో దుర్గారావును తీసుకెళ్లే సూచనలున్నాయి. దీనికి అనుగుణంగా పోలీసులు రికార్డును సిద్ధం చేసుకున్నారు. ముందే దుర్గారావుతో పాటు అతడి తల్లిదండ్రులతో సంతకాలు తీసుకున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 07:55 AM