Share News

Sharmila: రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారు

ABN , Publish Date - Jan 21 , 2024 | 03:14 PM

రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్‌ ( CM Jagan ) తాకట్టు పెట్టారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( Y. S. Sharmila ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోసం ఎంతోమంది త్యాగం చేశారని.. వేలాది మంది ఇక్కడకు తరలి వచ్చారని షర్మిల అన్నారు.

Sharmila: రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారు

విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్‌ ( CM Jagan ) తాకట్టు పెట్టారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( Y. S. Sharmila ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోసం ఎంతోమంది త్యాగం చేశారని.. వేలాది మంది ఇక్కడకు తరలి వచ్చారన్నారు. వారందరికీ వైఎస్ బిడ్డగా తాను తల వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. షర్మిల ప్రసంగం సమయంలో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. APCC చీఫ్‌గా షర్మిల ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. AICC తీర్మానాన్ని గిడుగు రుద్రరాజు చదివి వినిపించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఏపీపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. రాజధాని కట్టడానికి కూడా డబ్బుల్లేవని.. ఏపీలో ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం మాత్రమేనని అన్నారు. ఏపీలో మైనింగ్‌, ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్నారు.ఏపీలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేతకాలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌... ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు.

ఆ పాపం జగన్‌దే...

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగన్‌దేనని షర్మిల మండిపడ్డారు. జగన్ 3 రాజధానులు అని ఒక్కటీ కూడా కట్టలేదని వివరించారు.రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చేశారని దుయ్యబట్టారు. జగన్ నాలుగున్నరేళ్లలో రూ.6.5లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఏపీకి పదేళ్లలో పట్టుమని పది పరిశ్రమలైనా వచ్చాయా? అని నిలదీశారు. ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటున్నారని.. ఇంత అప్పు చేసినా ఏపీలో అభివృద్ధి భూతద్దంలో చూసినా కనిపించడం లేదన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం లేదు.. కనీసం ఒక్క మెట్రో కూడా నిర్మాణం చేయలేదని మండిపడ్డారు. ఈ పదేళ్లల్లో పది పెద్ద పరిశ్రమలు అయినా కనీసం వచ్చాయా? అని ప్రశ్నించారు. పాలకులు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యారన్నారు. ఐదేళ్లు హోదా అని కాంగ్రెస్ అంటే.. బీజేపీ పదేళ్లు ఇస్తాం మంటున్నారు. జగన్ సీఎం అయ్యాక ఒక్కసారైనా.. హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? అని నిలదీశారు. నేడు హోదా కాదు.. కనీసం స్పెషల్ ప్యాకేజీ కూడా లేదని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు.

ఏపీపై బీజేపీ కపట ప్రేమ

బీజేపీ ( BJP ) ఏపీపై కపట ప్రేమ చూపించడమే తప్ప.. చేసిందేమీ లేదని షర్మిల మండిపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు అన్న బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. నేడు అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా చూపించాలని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలపై ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనం మొత్తం తీసుకువస్తామని మోదీ చెప్పలేదా.. ఎంత తెచ్చారు.. పేదల చేతుల్లో ఎంత పెట్టారని ప్రశ్నించారు. ఇంత మోసం చేసిన బీజేపీనీ ఎలా నమ్మాలని నిలదీశారు. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే వీరు చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయతీలు, ఇతర సౌకర్యాలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలు వస్తే బిడ్డలకు ఉద్యోగాలు కూడా వచ్చేవని తెలిపారు. పదేళ్లల్లో ప్రత్యేక హోదా రాకపోవడం కాదు.. పాలకులు తేలేకపోయారని షర్మిల ధ్వజమెత్తారు.

Updated Date - Jan 21 , 2024 | 03:23 PM