Share News

Chandrababu Naidu: కుర్చీ మడతపెట్టి.. జగన్‌కు చంద్రబాబు మాస్ వార్నింగ్..!

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:47 PM

Chandrababu Naidu: ఐదేళ్లుగా మూడు రాజధానుల జపం చేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు నాలుగవ రాజధాని పేరు ప్రస్తావిస్తోందని చంద్రబాబు విమర్శించారు. కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసం కాదు.. అరాచకం జరిగిందన్నారు.

Chandrababu Naidu: కుర్చీ మడతపెట్టి.. జగన్‌కు చంద్రబాబు మాస్ వార్నింగ్..!
Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 15: రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని ప్రజలు పిలుస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చునని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు.. ఈ పుస్తకం ఒక జర్నలిస్టు ధర్మాగ్రహం అని పేర్కొన్నారు. ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశారో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారని అన్నారు. రేపో మాపో పుస్తక రచయిత ఆలపాటి సురేష్‌కు కూడా వేధింపులు ఎదురవుతాయి. తన మనస్సులో, ప్రజల మనస్సులో ఏముందో స్పష్టంగా ఈ పుస్తకంలోనూ అదే రాశారని చంద్రబాబు అన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్, యువత భవిష్యత్ దెబ్బ తిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

అమరావతి రైతులు త్యాగం చేశారు..

ఈ పుస్తకాన్ని అమరావతి మహిళలకు అంకితం ఇవ్వడంపై ఆలపాటి సురేష్‌ను చంద్రబాబు ప్రశంసించారు. ఆయన నిజాయితీకి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. అమరావతి రైతులు త్యాగం చేశారని, అమరావతి రైతులను పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువులకు కూడా రాకూడదన్నారు. అమరావతి ప్రజా రాజధాని కావాలని సర్వమత ప్రార్థనలు చేసి ఇక్కడ సంకల్పం చేశామని చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మించి ఉంటే 2 లక్షల కోట్ల ఆస్తి సృష్టించబడేదని, ఇది ప్రజలు ఆస్తి అని పేర్కొన్నారు.

కనీసం సిగ్గు లేదు..

ఐదేళ్లుగా మూడు రాజధానుల జపం చేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు నాలుగవ రాజధాని పేరు ప్రస్తావిస్తోందని చంద్రబాబు విమర్శించారు. కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసం కాదు.. అరాచకం జరిగిందన్నారు. ‘ప్రజా వేదిక కూల్చి ఆ శకలాలను చూసి నేను ప్రతిరోజూ బాధపడాలి అని చేసిన వ్యక్తిని సైకో గాక ఏమంటారు? నేను ప్రజా వేదిక కావాలని అడిగితే దానిని కూల్చి వేశారు. నేను ఉండే ఇల్లు కూల్చాలని ఐదేళ్లు చూశారు. పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి తరిమేశారు. నేను, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం దృఢంగా పోరాడుతున్న సందర్భం ఇది.’ అని చంద్రబాబు అన్నారు.

ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు పొలం ఇచ్చారనే కారణంతో అక్కడి రైతుల ఇల్లు కూర్చేశారని వైసీపీ ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు చంద్రబాబు. ఏ తప్పూ చేయని డాక్టర్ సుధాకర్‌ను వెంటాడి వేధించారన్నారు. శంకర్ విలాస్ రంగనాయకమ్మ వ్యాపారం వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు అంటే ఎంతో బాధగా ఉందన్నారు. అమరనాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి దగ్ధం చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చివరకు సీఎం జగన్ సొంత సోదరి, తల్లిని కూడా సోషల్ మీడియాలో వదల్లేదన్నారు.

ఆ ఘటనతో కన్నీరు కార్చాను..

తనపై బాంబు దాడి జరిగినప్పుడు కూడా కళ్ల వెంట చుక్క నీరు రాలేదు కానీ.. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి తన కళ్ల వెంట నీరు వచ్చిందన్నారు చంద్రబాబు. అందుకే.. తాను అసెంబ్లీ కౌరవ సభ నుంచి గౌరవ సభ చేశాకనే వస్తానని చెప్పానన్నారు. రాష్ట్రాన్ని జగన్ విద్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారని, మద్యం, ఇసుక, మైనింగ్ ఏది కనపడితే అది దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

కూర్చీ మడతపెట్టి..

తనకు పవన్ కల్యాణ్‌కు తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా ఉండాలనే సంకల్పం ఉంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై తిరగబడాల్సిన సమయం ఇది అని.. ఇంకా 53 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ‘సీఎం చొక్కా మడత బెడితే.. మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడతపెడతారు. అప్పుడు జగన్‌కు కుర్చీనే ఉండదు. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే జనం ఊరుకోరు.’ అంటూ సీఎం జగన్‌కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2024 | 10:00 PM