CM Chandrababu: వైసీపీ చాలా ఇబ్బందులు పెట్టింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 17 , 2024 | 09:31 PM
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు.

అమరావతి: వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. ఈ పోరాటంలో పార్టీ లీగల్ సెల్ చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
నాల్గోసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడుకు లీగల్ సెల్ సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఈరోజు(సోమవారం) చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే దారుణాలకు పాల్పడటం, రౌడీయిజం చేయడం అనేది వైసీపీ హయాంలోనే చూశామని అన్నారు. 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలను ఎదుర్కొన్న కార్యకర్తలపై కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.
ఆ అక్రమ కేసులపై టీడీపీ లీగల్ సెల్ బ్రాహ్మాండంగా పని చేసిందని ప్రశంసించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా లీగల్ సెల్ తరపున కార్యకర్తలకు అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని అన్నారు. వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.