CM Chandrababu : నేను బాగు చేయడం.. వాళ్లొచ్చి నాశనం చేయడం!
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:34 AM
నేను ముఖ్యమంత్రిగా ఉండగా బాగు చేయడం.. నా తర్వాతి వాళ్లు వచ్చి నాశనం చేయడం... ఆ తర్వాత మళ్లీ నేనొచ్చి బాగు చేయడం... ప్రతిసారీ ఇదే తంతు నడుస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు ఆవేదన
జగన్ లాంటి వాళ్లకు విశ్వసనీయత, నిలకడ ఉండవని వ్యాఖ్య
మళ్లీ నేనొచ్చి రిపేర్ చేయడం.. ప్రతిసారీ ఇదే తంతు
ఎప్పుడైనా కూలగొట్టడం చాలా తేలిక. నిర్మించడం చాలా కష్టం. గత ఐదేళ్లూ ప్రతి రంగాన్నీ భ్రష్టు పట్టించుకుంటూ వెళ్లారు. 6నెలలుగా నేను రాత్రింబవళ్లూ పనిచేస్తూ అధికారులకు మార్గదర్శకత్వం ఇస్తూ అవసరమైన చోట టెక్నాలజీని వాడుతున్నా ఇంకా బాగు చేయలేకపోతున్నాను.
- సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా బాగు చేయడం.. నా తర్వాతి వాళ్లు వచ్చి నాశనం చేయడం... ఆ తర్వాత మళ్లీ నేనొచ్చి బాగు చేయడం... ప్రతిసారీ ఇదే తంతు నడుస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఎత్తిపోతల పథకాల దుస్థితి గురించి ప్రస్తావన వచ్చింది. ‘రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల కింద పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు 5లక్షల ఎకరాలకు మించి సాగు కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వాటిని పట్టించుకునే దిక్కులేక.. నిర్వహణ లేక మూలపడ్డాయి. ఆర్థికం సహా ప్రభుత్వ వ్యవస్థలను కుప్పకూల్చిపోయారు. ఇంత ఘోరమైన పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేస్తామని ముందు ప్రకటనలు చేసి తర్వాత వాయిదా వేస్తూ వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నించినప్పుడు.. విశ్వసనీయత, నిలకడ లేని వ్యక్తుల తీరు అంతే ఉంటుందని ఆయన బదులిచ్చారు. ‘కొంత మంది నాయకులకు లోలోపల రహస్య ఎజెండాలు ఉంటాయి. పారదర్శకత ఉండదు. మేమేదైనా చేయాల్సి వస్తే సాధ్యాసాధ్యాలు చూసి అన్నీ అంచనా వేసుకుని ముందుకు వెళ్తాం. వాళ్లకు అది పట్టదు. తాము చెప్పిందే వాస్తవమని ప్రజలను నమ్మించాలని చూస్తారు’ అని చెప్పారు. దేశంలో రైతాంగంపై రుణ భారం మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందన్నారు. వారినెలా బయటపడేయాలి.. ఆదాయమెలా పెంచాలి.. వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మార్చాలో తీవ్రంగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
విద్యుత్ ధర 4.80కి తగ్గిస్తాం
విద్యుత్ కొనుగోలు రేటు ప్రస్తుతం యూనిట్ రూ.5.18గా ఉంది. దానిని ఈ ఏడాది 4.80కి తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ కుసుమ్ పథకం కింద సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని గ్రిడ్‌కు అనుసంధానం చేయబోతున్నాం. సూర్య ఘర్ పథకం కింద వీలైనన్ని ఇళ్ల పై కప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి అక్కడ మిగులు విద్యుత్ కూడా గ్రిడ్‌కు తీసుకురావాలని అనుకుంటున్నాం. వీటి వల్ల కొంత మేర విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది.
4 దక్షిణాది నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలు
నాలుగు దక్షిణాది నగరాలైన బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతిలో కలిపి నాలుగు కోట్ల జనాభా ఉంది. ఈ నాలుగు నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలు కావాలని రైల్వే మంత్రిని కోరాను. బుల్లెట్ రైలు వస్తే ఒక నగరం నుంచి మరో నగరానికి గంటలో వెళ్లవచ్చు. వీటన్నింటికి మధ్యలో అమరావతి ఉన్నందువల్ల అమరావతి మీదుగా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయవచ్చని సూచించా.