Tummala Nageswara Rao: ఆ నేతలంతా నాకు సహకరించాలి
ABN , First Publish Date - 2023-09-25T22:45:50+05:30 IST
కాంగ్రెస్(Congress) నాయకత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నేతలంతా తనకు సహకరించాలని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు.
ఖమ్మం: కాంగ్రెస్(Congress) నాయకత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నేతలంతా తనకు సహకరించాలని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సోమవారం నాడు తొలిసారిగా డీసీసీ కార్యాలయంలో తుమ్మల అడుగుపెట్టారు. తుమ్మలకు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానం పలికారు. తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరాను. 40 ఏళ్లుగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేశా. అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతతో అందరితో కలిసి పనిచేస్తాం.కాంగ్రెస్ పార్టీ దేవాలయంగా భావించే పార్టీ. ఈ కార్యాలయంలో నాకు అపూర్వ స్వాగతం పలికారు. నలబై ఏళ్లుగా రాజకీయాల్లో నిబద్ధత గల వ్యక్తిగా అభివృద్ధి కోసం పాటుపడ్డా. భద్రాద్రి శ్రీ రామచంద్రుని ఆశీస్సులతో నా శక్తి మేర పనిచేశా. జాతీయ నాయకత్వం ఇచ్చిన బాధ్యతతో అందరితో కలిసి పనిచేస్తాం. నన్ను రాష్ట్ర జాతీయ నాయకత్వం పార్టీలో ఆహ్వానం మేరకు చేరాను. వారి నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తా. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల అమలుతో తెలంగాణకు మహర్దశ పట్టబోతోంది. సోనియాగాంధీ, రాహుల్ నిర్ణయాలకు కట్టుబడి పనిచేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేద్దాం’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కేసీఆర్ రాజ్యాంగంపై దాడి చేశారు..
విలువలతో రాజకీయం చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క(Bhattivikramarka) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీనియర్ నేతలు తుమ్మల, పొంగులేటి లాంటి నేతలతో కాంగ్రెస్ ఎంతో బలపడుతుంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై దాడి చేశారు. ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో దుర్మార్గపు పాలన చేస్తున్నారు. మాయమాటలతో కేసీఅర్ పాలన సాగుతోంది. ధనిక రాష్ట్రం తెలంగాణను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. సామాన్యులు రైతులు సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి’’ అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.