TS News : తెలంగాణలో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌.. అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?

ABN , First Publish Date - 2023-08-22T12:46:15+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ , రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది.

TS News : తెలంగాణలో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌.. అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?

ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ , రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నార్మల్‌గా ఈసారి ఎన్నికల బరిలోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్టం. అందుకే ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఆ స్థానాల్లోనే దిగ్గజాల పర్యటనలు..

మొత్తం 119 అసెంబ్లీ స్థానాలను ఏ, బి, సి అనే మూడు కేటగిరీలుగా విభజించనుంది. మొదటి కేటగిరీలో ఇప్పటి వరకూ గెలిచిన స్థానాలు, రెండో కేటగిరీలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన స్థానాలు, మూడో కేటగిరిలో ఇప్పటివరకూ గెలవని స్థానాలను ఉంచబోతున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని.. ఈ స్థానాల్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాల పర్యటనలు ఉండేలా చూసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీని అధిష్టానం అడిగినట్లు సమాచారం. అది అందిన వెంటనే బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు..

అయితే ఈసారి మహిళలకు అధిక స్థానాలను కేటాయించాలని కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 33 శాతం మహిళా రిజర్వేషన్ ను తెరపైకి తెచ్చిన కవితకు, బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు అధిక స్థానాలను మహిళలకు కేటాయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి కూడా తొలిసారి అసెంబ్లీ బరిలో నివాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంబర్ పేట లేదా ముషీరాబాద్ నుంచి ఆమె పోటీచేసే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఆమెతో పాటు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సైతం సికింద్రాబాద్ లేదంటే సనత్ నగర్ నుంచి పోటీచేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి దత్తాత్రేయ విజ్ణప్తి కూడా చేసినట్లు సమాచారం.

ఈసారి ఎన్నికల్లో వారికే అవకాశం..

బీజేపీలోని ప్రముఖుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఈసారి ఎన్నికల్లో అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ, విజయశాంతి, జయసుధ, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, జూబ్లీహిల్స్ జూలూరు కీర్తిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తిలకు దాదాపు సీట్లు ఖరారు అయినట్లు సమాచారం. ఇబ్రహీం పట్నం నుంచి రాణి రుద్రమ, సనత్ నగర్ నుంచి ఆకుల విజయ, శ్రీవాణి, డాక్టర్ వీరపనేని పద్మ తదితరులు కూడా ఈ సారి అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

రాజ్యసభకు కిషన్ రెడ్డి?

తన సతీమణి కావ్యకు అధిష్టానం అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే కిషన్ రెడ్డి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీచేసే అవకాశాలు లేకపోలేదు. అయితే పార్టీని ముందుండి నడిపించాలంటే కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం మంచిదని కొంతమంది చెబుతుంటే అసలు ఆయన పోటీచేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్నవారు కూడా ఉన్నారు. 2024 తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షునిగా కూడా కిషన్ రెడ్డి పేరు గట్టిగానే వినిపిస్తొంది. జేపీ నడ్డా రిటైర్ అయిన తరువాత కిషన్ రెడ్డి కేంద్రంలో మకాం వేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఆ వ్యూహంలో భాగంగానే తన భార్య పేరును తెరపైకి తెచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి అధిష్టానం మదిలో ఏముందో తెలియాలంటే మరో వారం, పదిరోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-08-22T12:49:55+05:30 IST