TS Politics: తెలంగాణలో మారుతున్న సమీకరణలు.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి.. కాంగ్రెస్ హౌస్‌ఫుల్..!

ABN , First Publish Date - 2023-09-26T17:52:14+05:30 IST

ఇక తాజా పరిణామాలపై బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా తిరుగుబావుటా ఎగరేయడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు బుజ్జగింపులు చేస్తున్నా.. నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా గట్టు దూకేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల

TS Politics: తెలంగాణలో మారుతున్న సమీకరణలు.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి.. కాంగ్రెస్ హౌస్‌ఫుల్..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలున్నాయి. దీంతో కొత్త కొత్త ప్రణాళికలతో పాచికలు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు షాక్ అయ్యేలా ముందుగానే గులాబీ బాస్ (Cm kcr) అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక ప్రధాన ప్రత్యర్థి పార్టీలు ఇంకా సమాలోచనలు.. సంప్రదింపుల్లోనే సతమతం అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కేవలం దరఖాస్తులు మాత్రమే స్వీకరించింది. కానీ అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఎంపికపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఎవరికి సీటు ఇవ్వాలి? ఎవరు గెలుస్తారు?, ఇలా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైపోయాయి. అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ఎలాంటి కసరత్తు చేస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇదిలా ఉంటే రాజకీయ వలసలతో కాంగ్రెస్ హౌస్‌ఫుల్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లోకి (BRS) వెళ్లినవారంతా తిరిగి సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కంభం అనిల్ కుమార్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఈయన భువనగురి సీటును ఆశించి బీఆర్ఎస్‌లో భంగపడ్డారు. అనిల్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడిగా గుర్తింపు ఉంది. కానీ ఆయనతో విభేదాలు కారణంగానే బీఆర్ఎస్‌లో చేరినట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ చేయించిన సర్వేలో కచ్చితంగా అనిల్ గెలుస్తున్నట్లు తేలినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనతో వెంటనే అనిల్ ఇంటికి వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కండువా కప్పి పార్టీలో చేర్చేసుకున్నారు. ఈ సీటు గెలవడం ఖాయమని కాంగ్రస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతకముందు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకతో ఖమ్మం కాంగ్రెస్‌లో బలం పుంజుకుంది. ఇంతలోనే తుమ్మల నాగేశ్వరరావు రాకతో ఆ బలం మరింత రెట్టింపు అయింది. ఇలా వలసలతో కాంగ్రెస్ మంచి ఊపులో ఉంది. అంతేకాదు ఇప్పుడు బీఆర్ఎస్‌లో సీటు రాక భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరంతా హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది.

ఇక తాజా పరిణామాలపై బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా తిరుగుబావుటా ఎగరేయడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు బుజ్జగింపులు చేస్తున్నా.. నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా గట్టు దూకేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కసిరెడ్డి నారాయణరెడ్డితో మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరిపినా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎప్పుడెవరు కారు దిగుతారో అర్థం కాక గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ వ్యూహాలు కూడా సీఎం కేసీఆర్‌కు అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. రోజురోజుకూ కాంగ్రెస్‌ పంజుకోవడంతో కేసీఆర్‌ ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

KCR : దిగొస్తున్న గులాబీబాస్‌!

Congress BRS: ఆగమేఘాల మీద అనిల్ విషయంలో ఇలా ఎందుకు జరిగిందంటే..!

Updated Date - 2023-09-26T17:52:14+05:30 IST