Share News

IND vs AUS: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రికార్డును బద్దలుకొట్టిన 21 ఏళ్ల కుర్రాడు

ABN , First Publish Date - 2023-11-27T07:06:31+05:30 IST

Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.

IND vs AUS: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రికార్డును బద్దలుకొట్టిన 21 ఏళ్ల కుర్రాడు

తిరువనంతపురం: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు. నాథన్ ఎల్లీస్ వేసిన ఆరో ఓవర్లోనూ చెలరేగిన జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో జైస్వాల్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జైస్వాల్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు బాదేశాడు. స్ట్రైక్‌రేట్ ఏకంగా 212గా ఉంది. ఈ పరుగులన్నీ జైస్వాల్ పవర్‌ప్లేలోనే సాధించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గత రికార్డును ఈ 21 ఏళ్ల కుర్రాడు బద్దలుకొట్టాడు. గతంలో పవర్‌ప్లేలో రోహిత్, రాహుల్ 50 పరుగులు చేశారు. దీంతో ఇంతకాలం భారత్ తరఫున పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరిద్దరు పేరు మీదనే ఉన్నది. తాజాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ జైస్వాల్ 53 పరుగులతో ఈ రికార్డును బద్దలుకొట్టాడు. మొత్తంగా 21 ఏళ్ల కుర్రాడు యశస్వి జైస్వాల్ దెబ్బకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రికార్డు గల్లంతైంది.


ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), యశస్వీ జైస్వాల్‌ (25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ధాటికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఎల్లి్‌సకు మూడు వికెట్లు దక్కాయి. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో భారీ ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది. స్టొయినిస్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 45), మాథ్యూ వేడ్‌ (23 బంతుల్లో ఓ ఫోర్‌, 4 సిక్సర్లతో 42 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) ఫర్వాలేదనిపించారు. రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా యశస్వీ జైస్వాల్‌ నిలిచాడు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 2-0కి చేరింది.

Updated Date - 2023-11-27T07:10:58+05:30 IST