Share News

World Cup: 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థి నవీన్ ఉల్ హక్

ABN , First Publish Date - 2023-11-11T11:47:17+05:30 IST

Naveen-ul-Haq retirement: అప్ఘానిస్థాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా చాలా కెరీర్ ఉన్నప్పటికీ 24 ఏళ్ల చిన్న వయసులోనే వన్డేల నుంచి రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సౌతాఫ్రికాతో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు.

World Cup: 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థి నవీన్ ఉల్ హక్

అప్ఘానిస్థాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా చాలా కెరీర్ ఉన్నప్పటికీ 24 ఏళ్ల చిన్న వయసులోనే వన్డేల నుంచి రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడిన నవీన్ ఉల్ హక్ శుక్రవారం సౌతాఫ్రికాతో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. తన మొదటి వన్డే మ్యాచ్‌ను 2016లో ఆడిన నవీన్ ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడాడు. 22 వికెట్లు పడగొట్టాడు. అయితే నవీన్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నప్పటీ టీ20 పార్మాట్‌లో కొనసాగున్నాడు. తన కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. సౌతాఫ్రికాతో జరిగిన తన చివరి మ్యాచ్‌లో 6.3 ఓవర్లు బౌలింగ్ చేసిన నవీన్ 52 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికా చేతిలో అఫ్ఘానిస్థాన్ ఓటమిపాలైంది. దీంతో నాకౌట్ చేరలేకపోయినా అఫ్ఘానిస్థాన్ ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. అనంతరం నవీన్ ఉల్ హక్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.


‘‘నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం. ఈ ప్రపంచకప్ ముగింపుతో వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నాను. అయితే నా దేశం కోసం టీ20 క్రికెట్‌లో బ్లూ జెర్సీని ధరించడం కొనసాగిస్తాను. ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు. కానీ నా కెరీర్‌ను పొడిగించడం కోసం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. నాకు మద్దతుగా నిలిచిన అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డుకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.’’ అని నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్‌లాడిన నవీన్ ఉల్ హక్ 34 వికెట్లు తీశాడు. మరోవైపు నవీన్ ఉల్ అనేక టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ వంటి వాటిల్లో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్ ఉల్ హక్ గతేడాది విరాట్ కోహ్లీతో మైదానంలో జరిగిన వివాదంతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ ఘటన తర్వాత నవీన్ ఉల్ హక్‌ను విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. నవీన్ మైదానంలో ఉన్నప్పుడు కోహ్లీ.. కోహ్లీ.. అని అరుస్తూ అతడిని ఇబ్బందిపెట్టారు. అయితే ఇటీవల ప్రపంచకప్‌లో భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ వివాదానికి తెరపడింది. కోహ్లీ-నవీన్ ఒకరినొకరు కరచాలనం చేసుకుని, కౌగిలించుకుని ఒకటయ్యారు. కోహ్లీ సైతం నవీన్‌పై ట్రోలింగ్‌ను ఆపాలనిమైదానంలోనే అభిమానులకు సూచించాడు. ఇక భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. ఒకానొక దశలో సెమీస్ చేరేలా కనిపించింది. కానీ చివరి రెండు మ్యాచ్‌లో ఓడి నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి ఆరో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించింది. కాగా 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి అఫ్ఘానిస్థాన్ అర్హత సాధించింది.

Updated Date - 2023-11-11T12:31:21+05:30 IST