Share News

IND vs NZ: రోహిత్ vs బౌల్ట్.. కోహ్లీ vs శాంట్నర్.. భారత్, కివీస్ పోరులో టాప్ బ్యాటిల్స్ ఇవే!

ABN , First Publish Date - 2023-10-22T11:42:40+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో సమవుజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs NZ: రోహిత్ vs బౌల్ట్.. కోహ్లీ vs శాంట్నర్.. భారత్, కివీస్ పోరులో టాప్ బ్యాటిల్స్ ఇవే!

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో సమవుజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీల్లో కివీస్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయిన భారత్ ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రెండు జట్లను గాయాలు ఇబ్బందిపెడుతున్నాయి. గాయాల కారణంగా టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అలాగే రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ కూడా స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు. ఇషాన్ కిషన్‌ను తేనే టీగ కుట్టింది. దీంతో వీరు ముగ్గురు ఆడతారా? లేదా? అనేది మ్యాచ్ సమయానికి గానీ స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు జట్లలోని టాప్ ఆటగాళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్‌కు, న్యూజిలాండ్ పేస్ బౌలింగ్‌కు మధ్య పోరుగా ఈ మ్యాచ్ నిలవనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లలోని టాప్ ఆటగాళ్ల మధ్య గతంలో జరిగిన పోరాటాలను(బ్యాటిల్స్) ఒకసారి పరిశీలిద్దాం.


రోహిత్ శర్మ vs ట్రెంట్ బౌల్ట్

సాధారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ పేసర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతుంటాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మొదటి ఓవర్‌ను లెఫ్ట్ హ్యాండ్ పేసరైన ట్రెంట్ బౌల్ట్ వేయనున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా ఆడే రోహిత్ శర్మ బౌల్ట్‌ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇద్దరికీ కావాల్సినంత అనుభవం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య గతంలో జరిగిన పోటీలను ఒకసారి గమనిస్తే బౌల్ట్‌ది కాస్త అధిపత్యం కనిపిస్తోంది. వీరిద్దరు ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో తలపడ్డారు. 137 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 22 సగటుతో 89 పరుగులే చేశాడు. 90 డాట్ బాల్స్ ఉండగా.. స్ట్రైక్ రేట్ 64.96 మాత్రమే ఉంది. అలాగే రోహిత్‌ను బౌల్ట్ నాలుగు సార్లు ఔట్ చేశాడు.

విరాట్ కోహ్లీ vs మిచెల్ శాంట్నర్

సాధారణంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో విరాట్ కోహ్లీ తడబడుతుంటాడు. న్యూజిలాండ్ జట్టులో మిచెల్ శాంట్నర్ రూపంలో నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. దీంతో కివీస్ జట్టు కోహ్లీపై శాంట్నర్‌ను ప్రయోగించడం ఖాయం. వీరిద్దరు గతంలో 14 ఇన్నింగ్స్‌ల్లో పోటీ పడ్డారు. 214 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 50 సగటుతో 151 పరుగులు చేశాడు. 89 డాట్ బాల్స్ ఉండగా.. స్ట్రైక్ రేటు 70గా ఉంది. కాగా కోహ్లీని శాంట్నర్ 3 సార్లు ఔట్ చేశాడు. గతాన్నిపరిశీలిస్తే ఇద్దరు సమాన స్థాయిలో సత్తా చాటారు. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కుల్దీప్ యాదవ్ vs టామ్ లాథమ్

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన పోటీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, టామ్ లాథమ్ మధ్యన ఉండనుంది. ప్రస్తుతం ఆయా జట్లలో వీరిద్దరు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. టీమిండియా స్పిన్ భారాన్ని కుల్దీప్ యాదవ్ మోస్తుండగా.. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో న్యూజిలాండ్ జట్టుకు లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక వీరిద్దరు గతంలో 6 సార్లు తలపడ్డారు. ఇద్దరు సమాన స్థాయిలో సత్తా చాటారు. 48 సగటు, 112 స్ట్రైక్ రేటుతో లాథమ్ 97 పరుగులు చేశాడు. ఇందులో 30 డాట్ బాల్స్ ఉన్నాయి. అలాగే లాథమ్‌ను కుల్దీప్ యాదవ్ రెండు సార్లు ఔట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-10-22T11:42:40+05:30 IST