Share News

World Cup: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను అధిగమించిన టీమిండియా.. ఆస్ట్రేలియా తర్వాత మనమే..

ABN , First Publish Date - 2023-10-30T12:28:48+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

World Cup: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను అధిగమించిన టీమిండియా.. ఆస్ట్రేలియా తర్వాత మనమే..

లక్నో: వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న భారత్ సెమీస్‌కు కూడా చేరువైంది. అయితే 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇది 59వ విజయం. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో 58 విజయాలు సాధించిన న్యూజిలాండ్‌ను టీమిండియా అధిగమించింది. 73 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంంది. కాగా అత్యధికంగా 5 సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో 50 విజయాలు సాధించిన ఇంగ్లండ్ నాలుగో స్థానంలో, 47 విజయాలు సాధించిన పాకిస్థాన్ ఐదో స్థానంలో, 43 విజయాలు సాధించిన వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉన్నాయి. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో విజయాల శాతంలోనూ టీమిండియా రెండో స్థానంలో ఉంది. భారత జట్టు విజయాల శాతం 65గా ఉంది. 73 శాతం విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 61 శాతం విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జోరు మీదున్న భారత జట్టుకు వరుసగా ఆరో విజయం దక్కింది. బ్యాటింగ్‌లో ఇబ్బందిపడినా.. బౌలర్లు అద్భుత రీతిలో ఆదుకున్నారు. దీంతో 230 పరుగుల స్వల్ప ఛేదన సైతం ఇంగ్లండ్‌కు కొండంతలా మారింది. ఫలితంగా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్‌ 12 పాయింట్లతో సెమీస్‌కు అతి చేరువలో నిలిచింది. అటు ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు పాయింట్లతోనే ఉన్న ఇంగ్లండ్‌ ఇంకా సాంకేతికంగా రేసులోనే ఉన్నా ముందుకెళ్లడం అసాధ్యమే. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87) కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోగా, పేసర్లు షమి (4/22), బుమ్రా (3/32) ఇంగ్లండ్‌ను వణికించారు. తాజా టోర్నీలో తొలిసారిగా ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (49), రాహుల్‌ (39) అండగా నిలిచారు. డేవిడ్‌ విల్లేకు మూడు.. వోక్స్‌, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్‌ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. లివింగ్‌స్టోన్‌ (27) టాప్‌స్కోరర్‌. కుల్దీ్‌పకు రెండు, జడేజాకు ఓ వికెట్‌ దక్కింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రోహిత్‌ నిలిచాడు.

Updated Date - 2023-10-30T13:22:43+05:30 IST