Share News

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

ABN , First Publish Date - 2023-11-16T09:48:57+05:30 IST

Shubman Gill Injury: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో గిల్ గాయపడడం టీమిండియాను కాస్త కలవరపెట్టింది. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే చివరలో గిల్ మళ్లీ బ్యాటింగ్ రావడం, ఫీల్డింగ్ కూడా చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయంపై గిల్ మాట్లాడాడు.

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

ముంబై: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్ భారీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో గిల్ గాయపడడం టీమిండియాను కాస్త కలవరపెట్టింది. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే చివరలో గిల్ మళ్లీ బ్యాటింగ్ రావడం, ఫీల్డింగ్ కూడా చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయంపై గిల్ మాట్లాడాడు. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత తన ఫిట్‌నెస్ గురించి చెప్పాడు. అలాగే ఫైనల్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనే దానిపై కూడా స్పష్టత ఇచ్చాడు.


‘‘నా బ్యాటింగ్ పరంగా నేను నిజంగా ఏదీ సర్దుబాటు చేసుకోలేదు. ఎందుకంటే డెంగ్యూ తర్వాత నా కండర పుష్టి కాస్త తగ్గింది. దీంతో తేమతో ఉండే పరిస్థితుల్లో ఎక్కువసేపు ఆడుతున్నప్పుడు తిమ్మిరి వస్తుంది. కానీ సాధారణంగా ఇది చాలా సమయం తర్వాత జరుగుతుంది. అంత త్వరగా రాదు. మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను నా కండర పుష్టిని కోల్పోయాను. ఆ సమయంలో తేమ కూడా ఉంది. ఆ కారణంగా నా కండరాలు పట్టేశాయి. ముందుగా ఇది తిమ్మిరితో ప్రారంభమైంది. ఆ తర్వాత నా కండరాల స్నాయువు లాగింది. అయితే నేను ఫైనల్‌కు ఓకే అవుతాను’’ అని గిల్ చెప్పాడు. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండనున్నాడు.

కాగా డెంగ్యూ జ్వరం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హిట్‌మ్యాన్ తర్వాత కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెంచరీ కొట్టడం ఖాయమనుకుంటున్న సమయంలో 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కండరాలు పట్టేయడంతో ఇబ్బందిపడ్డాడు. ఫిజియె వచ్చి పరీక్షించాక మైదానాన్ని వీడాడు. అయితే ఆ కాసేపటికే కోలుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ అప్పటికే ఓవర్లు అయిపోవడంతో సెంచరీ చేసే అవకాశం లేకుండా పోయింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొన్న గిల్ 8 ఫోర్లు, 3 సిక్సులతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Updated Date - 2023-11-16T11:18:28+05:30 IST