Share News

IND vs NZ: వాంఖడే పిచ్‌పై సెకండ్ బ్యాటింగ్ చేస్తే గెలుస్తామా?.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?

ABN , First Publish Date - 2023-11-15T10:21:38+05:30 IST

India vs New Zealand: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సెమీస్ సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే మొదటి సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఫైనల్ చేరి ఈ సారైనా కప్ గెలవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.

IND vs NZ: వాంఖడే పిచ్‌పై సెకండ్ బ్యాటింగ్ చేస్తే గెలుస్తామా?.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?

ముంబై: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సెమీస్ సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే మొదటి సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఫైనల్ చేరి ఈ సారైనా కప్ గెలవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. లీగ్ దశలోని ప్రదర్శన, ప్రస్తుత బలబలాలపరంగా చూస్తే న్యూజిలాండ్ కన్నా టీమిండియా బలంగా కనిపిస్తోంది. కానీ కివీస్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కలిసికట్టుగా ఆడి ఎంతటి బలమైన జట్టునైనా ఓడించే సత్తా కివీస్ వద్ద ఉంది. గత ప్రపంచకప్‌లోనే ఇది చేసి చూపించింది. అయితే ఈ మ్యాచ్ జరిగే వాంఖడే పిచ్ రిపోర్టు కాస్త కలవరపరుస్తోంది.


వాంఖడే పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే.. ఇది బ్యాటర్లకు స్వర్గధామంలాంటిది. ఈ టోర్నీలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు సగటు స్కోరు 357. దీనికి తగ్గట్టుగానే ఆయా జట్లు తమ స్కోరును కాపాడుకున్నా.. మ్యాక్స్‌వెల్‌ ఊచకోతతో ఆస్ట్రేలియా మాత్రం అఫ్ఘానిస్థాన్‌పై ఛేజింగ్‌లో గెలిచింది. ఈ పిచ్‌పై సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచింది ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో 3 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేయడం కష్టంతో కూడుకున్నది. ఈ టోర్నీల్లో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లన్నీ మొదటి 15 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయాయి. ఈ టోర్నీలో ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 187 పరుగులు మాత్రమే. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ సగం మాత్రమే ఉండడం గమనార్హం. ఇక్కడ ఫ్లడ్ లైట్ల వెలుతురులో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి 15 ఓవర్లు వికెట్లు కాపాడుకుంటే ఆ తర్వాత బ్యాటింగ్ సులభం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి టీమిండియాకు సెకండ్ ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే కివీస్‌ను 300 లోపే కట్టడి చేయాలని చెబుతున్నారు.

బౌలింగ్ పరంగా పేసర్లకు వికెట్‌ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో పేసర్లకు మంచి స్వింగ్ లభించనుంది. స్పిన్నర్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ పేసర్లు 47 వికెట్లు తీస్తే.. స్పిన్నర్లు 11 వికెట్లు మాత్రమే తీశారు. బుధవారం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశమున్నందున, మ్యాచ్‌కు వర్షం ముప్పు లేకపోవచ్చు. మొత్తంగా పిచ్ రిపోర్టును బట్టి చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు కలిసిరానుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలే ఎక్కువ. అయితే మొత్తంగా చూస్తే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ సమానంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్‌లు జరగగా 14 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 13 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు వన్డే ప్రపంచకప్ చరిత్రలో 10 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా కివీస్ 5 మ్యాచ్‌ల్లో, భారత్ 4 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మొత్తంగా వన్డే ఫార్మాట్లో రెండు జట్లు 117 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా భారత్ 59 మ్యాచ్‌లు గెలవగా.. న్యూజిలాండ్ 50 గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా ఏడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

Updated Date - 2023-11-15T10:21:40+05:30 IST