IND vs AUS: ప్రపంచ రికార్డు సృష్టించిన కింగ్ కోహ్లీ.. టీమిండియా, శ్రీలంక మాజీ దిగ్గజాల రికార్డులు గల్లంతు

ABN , First Publish Date - 2023-10-09T10:37:09+05:30 IST

ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు.

IND vs AUS: ప్రపంచ రికార్డు సృష్టించిన కింగ్ కోహ్లీ.. టీమిండియా, శ్రీలంక మాజీ దిగ్గజాల రికార్డులు గల్లంతు

చెన్నై: ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు. తమ అపార అనుభవంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఆసీస్‌ పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన నాన్ ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. కోహ్లీ ఇప్పటివరకు 113 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో 112 సార్లు 50+ స్కోర్లు సాధించిన శ్రీలంక మాజీ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు.


అలాగే ఈ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్‌ వన్డే ప్రపంచకప్‌లలో కోహ్లీకి 15వది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. కుంబ్లే 14 క్యాచ్‌లు పట్టగా.. 15 క్యాచ్‌లతో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దీంతోపాటు జట్టు విజయం సాధించినప్పుడు చేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అలాగే వన్డే ప్రపంచకప్‌లలో కోహ్లీకి ఇది 9వ 50+ స్కోర్. దీంతో ఈ టోర్నీలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 21 సార్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీతోపాటు ఈ మ్యాచ్‌లో ఇతర ప్లేయర్లపై కూడా పలు రికార్డులు నమోదయ్యాయి.

19 - ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే ప్రపంచకప్‌లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ టోర్నీలో వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. ఇందుకు వార్నర్ 19 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో 20 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కు అందుకున్న సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.

165 - కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.

1 - ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో టాప్ 3 బ్యాటర్లు డకౌట్ అయినప్పటికీ ఆ జట్టు గెలవడం ఇదే మొదటిసారి.

97 - ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచ కప్‌లలో భారత వికెట్ కీపర్ చేసిన రెండవ అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలో 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో ధోని చేసిన 91 పరుగుల రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999లో శ్రీలంకపై రాహుల్ ద్రవిడ్ 145 పరుగులు చేశాడు.

19 - ఈ మ్యాచ్‌లో తీసిన వికెట్ల ద్వారా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా ఈ మార్కు అందుకున్న బౌలర్‌గా శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. మలింగ 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కు అందుకోగ..స్టార్క్ 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్నాడు.

199 - ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 199 పరుగులు మాత్రమే చేసింది. ప్రపంచకప్‌లలో టీమిండియాపై ఆసీస్ రెండవ అత్యల్ప స్కోరు ఇదే. అంతకు ముందు 1983లో 129 పరుగులకే ఆలౌటైంది.

Updated Date - 2023-10-09T10:42:49+05:30 IST