Share News

World Cup: టీమిండియాను కంగారు పెట్టిన 40 నిమిషాలు.. ఆ సమయంలో అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-11-16T11:56:42+05:30 IST

Mohammed Shami: మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలవాలనే కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా ఇంకొక అడుగుదూరంలో ఉంది. ఫైనల్‌లోనూ గెలిస్తే 12 సంవత్సరాల తర్వాత విశ్వకప్ మన సొంతం అవుతుంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.

World Cup: టీమిండియాను కంగారు పెట్టిన 40 నిమిషాలు.. ఆ సమయంలో అసలు ఏం జరిగిందంటే..?

ముంబై: మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలవాలనే కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా ఇంకొక అడుగుదూరంలో ఉంది. ఫైనల్‌లోనూ గెలిస్తే 12 సంవత్సరాల తర్వాత విశ్వకప్ మన సొంతం అవుతుంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. మధ్యలో కివీస్ బ్యాటర్లు కాస్త కలవరపెట్టినా ఆ తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. భారత్ విసిరిన 398 పరుగుల లక్ష్య చేధనలో 39 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో మూడో వికెట్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఏకంగా 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్న నెలకొల్పారు. ఈ క్రమంలో మిచెల్ సెంచరీతో, విలియమ్సన్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయానికి టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మిచెల్, విలియమ్సన్ దూకుడు చూస్తే కివీస్‌ను గెలిపిస్తారమే అనిపించింది. భారత్‌కు మాత్రం ఓటమి భయం పుట్టింది. ఈ సమయంలో మన వాళ్లు చేసిన ఫీల్డింగ్ పొరపాట్లు కూడా మిచెల్, విలయమ్సన్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఓ 40 నిమిషాలపాటు మన ఫీల్డర్లు చేసిన తప్పులను చూసిన తర్వాత టీమిండియా గెలవదేమో అనే ఆందోళన అభిమానుల్లో కల్గింది.


ఆ 40 నిమిషాలు ఏం జరిగిందంటే..?

కేన్ విలియమ్సన్, మిచెల్ భారీ భాగస్వామ్యం నెలకొల్పడం టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్ని బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో ఎన్నిమార్పులు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మన ఫీల్డర్లు పలు తప్పిదాలు చేశారు. ముఖ్యంగా 8 గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల మధ్య సమయంలో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాలు కలవరపరిచాయి. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ తప్పిదాలు చేశారు. రవీంద్ర జడేజా కారణంగా ఓవర్ త్రోలో అదనంగా 4 పరుగులొచ్చాయి. జడేజా బౌలింగ్‌లో మిచెల్ బంతిని గాల్లోకి ఆడాడు. కానీ బంతి దిగే దగ్గర ఫీల్డర్లు ఎవరూ ఉండలేదు. దీంతో క్యాచ్ అందుకునే అవకాశం లేకుండాపోయింది. ఆ సమయంలో మనవాళ్లు సరిగ్గా బౌండరీలను కూడా ఆపలేదు. ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన 29వ ఓవర్ 5వ బంతికి కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను మహ్మద్ షమీ నేలపాలు చేశాడు. దీంతో మైదానంలో కొద్ది క్షణాలు నిశబ్ద వాతావరణం అలుముకుంది. భారత ఫీల్డర్లు చేసిన ఈ తప్పిదాల అనంతరం విలియమ్సన్, మిచెల్ మధ్య 150 పరుగుల భాగస్వామ్యం పూర్తైంది. అనంతరం కివీస్ స్కోర్ 200 దాటగా ఒకానొక దశలో 32.1 ఓవర్లలో 220/2తో చాలా బలంగా కనిపించింది. చూస్తుంటే కివీస్ మ్యాచ్ గెలిచేస్తుందేమో అనిపించింది.

షమీ అద్భుతం

ఇలాంటి సమయంలోనే షమీ అద్భుతం చేశాడు. క్యాచ్‌ను వదిలేశాననే బాధ ఒక వైపు, జట్టు ఓడిపోతుందేమోననే భయం ఒక వైపు.. వాటి నుంచి పుట్టుకొచ్చిన కసినే కావొచ్చు అది. కసితో బౌలింగ్ చేసిన షమీ నిప్పులు చెరిగాడు. 69 పరుగులు చేసిన విలియమ్సన్‌ను ఔట్ చేసి 33వ ఓవర్లో భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. అదే ఓవర్లో కివీస్ కీలక బ్యాటర్ టామ్ లాథమ్‌ను డకౌట్ చేశాడు. దీంతో ఒకసారిగా మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లోకి తెచ్చేశాడు. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ మళ్లీ కాస్త కంగారుపెట్టినప్పటికీ బుమ్రా వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత మరోసారి చెలరేగిన షమీ సెంచరీ హీరో మిచెల్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. దీంతో కివీస్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షమీ ఏకంగా 7 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో 5 వికెట్ల హాల్ సాధించడం షమీకి ఇది మూడో సారి. మొత్తంగా 23 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.

Updated Date - 2023-11-16T11:56:50+05:30 IST