Share News

Rahul Dravid: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరో రెండేళ్లు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్?

ABN , First Publish Date - 2023-11-29T10:43:48+05:30 IST

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మరికొంత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో హెడ్ కోచ్‌గా ఉండాలని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పెంచే అవకాశాలున్నాయని పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.

Rahul Dravid: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరో రెండేళ్లు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్?

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మరికొంత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో హెడ్ కోచ్‌గా ఉండాలని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పెంచే అవకాశాలున్నాయని పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి. నిజానికి టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్ కాంట్రాక్ట్ ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. 2021లో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు. ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ మంచి ప్రదర్శన కనబర్చింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్‌లో రన్నరఫ్‌గా నిలిచింది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ వరకు వెళ్లింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చింది. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆటగాళ్లందరిలో స్పూర్తి నింపి జట్టును బలంగా తయారుచేయండంలో ద్రావిడ్ విజయవంతమయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ విషయమై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


‘‘గత వారం ద్రావిడ్‌తో బీసీసీఐ సెక్రటరీ జైషా చర్చలు జరిపారు. ద్రావిడ్ టీమిండియా టెస్ట్ జట్టుతో దక్షిణాఫ్రికా వెళ్లాలని బీసీసీఐ కోరుకుంటుంది. అతను టీ20 సిరీస్‌కు వెళ్లకపోయినా వన్డే సిరీస్ నాటికి జట్టులో చేరొచ్చు.’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌కు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఉండొచ్చని చెప్పారు. ‘‘ప్రస్తుతం లక్ష్మణ్ టీమిండియా ‘ఏ’ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఎన్సీఏ చైర్మన్‌గా కూడా ఉన్నాడు. త్వరలో అండర్ 19 ప్రపంచకప్ రాబోతుంది.’’ అని ఆయన తెలిపారు. దీనిని బట్టి లక్ష్మణ్ టీమిండియా జూనియర్ జట్టుకు మరికొంత కాలం కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. కాగా ద్రావిడ్ కాంట్రాక్ట్ పూర్తవడంతో వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ద్రావిడ్ పదవీ కాలాన్ని మరింత పెంచే అవకాశాలు ఉండడంతో ఇప్పట్లో లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు లేకపోవచ్చు. ఇక కోచ్‌గా కొనసాగాలా? వద్దా? అనే విషయంపై ద్రావిడ్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పైగా ద్రావిడ్‌కు పలు ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి హెడ్ కోచ్‌గా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. అయితే ఒక వేళ నిజంగానే ద్రావిడ్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తే మాత్రం వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌తోపాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరకు అతనే టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉంటాడు. అయితే వచ్చే వారం సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. దీంతో అప్పుడే రాహుల్ ద్రావిడ్ విషయంపై కూడా స్పష్టత రావొచ్చు.

Updated Date - 2023-11-29T10:49:38+05:30 IST