Share News

World Records: ఇది కలనా? నిజామా? టీ20 ఇన్నింగ్స్‌లో 427 రన్స్.. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు

ABN , First Publish Date - 2023-10-15T13:33:53+05:30 IST

మహిళల టీ20 క్రికెట్‌లో కలలో కూడా ఊహించనది జరిగింది. టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా మహిళల జట్టు ఏకంగా 427 పరుగులు బాదేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి కావడం గమనార్హం.

World Records: ఇది కలనా? నిజామా? టీ20 ఇన్నింగ్స్‌లో 427 రన్స్.. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు

మహిళల టీ20 క్రికెట్‌లో కలలో కూడా ఊహించనది జరిగింది. టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా మహిళల జట్టు ఏకంగా 427 పరుగులు బాదేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి కావడం గమనార్హం. ఓపెనర్లు లూసియా టేలర్ (169), అల్బెర్టినా గలాన్ (145) కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 350 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్జెంటీనా బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఒకే ఓవర్లో ఏకంగా 52 పరుగులొచ్చాయి. సాధారణంగా వన్డే ఫార్మాట్లోనే 400కు పైగా పరుగులు రావడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో 400కు పైగా పరుగులు రావడం అంటే అది అద్భుతమనే చెప్పుకోవాలి. ఇక ఇంతలా బాదాక రికార్డులు బద్దలవ్వకుండా ఉంటాయా? అదీ జరిగింది. తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అర్జెంటీనా అమ్మాయిలు అనేక ప్రపంచరికార్డులను సైతం బద్దలుకొట్టేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇన్ని పరుగుల వచ్చాయంటే అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో సిక్సర్ల వర్షం కురిసింటుందని అనిపించొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే అర్జెంటీనా 427 పరుగుల కొండంత ఇన్నింగ్స్‌లో ఒక సిక్సు కూడా నమోదు కాలేదు. భారీ సెంచరీలతో చెలరేగిన లూసియా టేలర్, అల్బెర్టినా గలాన్ కూడా కనీసం ఒక సిక్సు కూడా బాదలేకపోయారు. ఇదంతా నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న నిజంగానే జరిగింది.


అర్జెంటీనా, చిలీ మహిళల జట్ల మధ్య 3 మ్యాచ్‌లు టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం రెండు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒకే ఒక వికెట్ కోల్పోయి ఏకంగా 427 పరుగులు చేసింది. ఓపెనర్లు లూసియా టేలర్, అల్బెర్టినా గలాన్ భారీ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 350 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 84 బంతులాడిన ఓపెనర్ లూసియా టేలర్ 27 ఫోర్లతో 169 పరుగులు బాదేసింది. ఎట్టకేలకు లూసియా టేలర్‌ను చిలీ బౌలర్ మిరాండా క్లీన్ బౌల్డ్ చేయడంతో 350 పరుగుల వద్ద అర్జెంటీనా మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ అల్బెర్టీనా గలాన్, వన్‌డౌన్ బ్యాటర్ మరియా కస్టెనెరస్‌తో కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించారు. 23 ఫోర్లతో 84 బంతుల్లోనే 145 పరుగులు చేసిన అల్బెటీనా గలన్, 7 ఫోర్లతో 16 బంతుల్లోనే 40 పరుగులు చేసిన మరియా కస్టెనెరస్ నాటౌట్‌గా నిలిచారు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో 120 బంతులే ఉంటాయి. ఈ మ్యాచ్‌లోనూ అన్నే బంతులు ఉన్నాయి. కానీ చిలీ బౌలర్ల ఫేలవ బౌలింగ్‌తో ఏకంగా 64 నోబాల్స్ వేశారు. ఇది అర్జెంటీనా భారీ స్కోర్ సాధించేందుకు సహకరించింది. అలాగే మరో 8 వైడ్లు, లెగ్ బైస్‌లో ఒక పరుగు ఇచ్చారు. మొత్తంగా ఎక్స్‌ట్రాల రూపంలోనే 73 పరుగులొచ్చాయి. చిలీ బౌలర్ ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒకే ఓవర్లో ఏకంగా 52 పరుగులు సమర్పించుకుంది. ఆ ఓవర్లో ఆమె ఏకంగా 17 నోబాల్స్ కూడా వేసింది. అనంతరం లక్ష్య చేధనలో 15 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన చిలీ 63 పరుగులకే కుప్పకూలింది. దీంతో చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కానీ విధంగా 364 పరుగుల తేడాతో అర్జెంటీనా ఘనవిజయం సాధించింది. చిలీ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన మిరాండానే బ్యాటింగ్‌లోనూ అత్యధిక స్కోర్ చేసింది. ఆమె 27 పరుగులు చేయగా.. మిగతా 10 మంది బ్యాటర్లు కలిసి 7 పరుగులే చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. అందులో నలుగురు రనౌట్ల రూపంలోనే ఔటయ్యారు. అర్జెంటీనా బౌలర్లలో కాన్‌స్టాంజా సోసా, అలిసన్ స్టాక్స్, మరియానా మార్టినెజ్, అల్బెర్టినా గాలన్, జూలియటా కల్లెన్ తలో వికెట్ తీశారు. 169 పరుగుల విధ్వంసంకర ఇన్నింగ్స్ ఆడిన లూసియా టేలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక ఈ మ్యాచ్‌లో నమోదైన ప్రపంచరికార్డుల విషయానికొస్తే పురుషుల, మహిళల టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి చరిత్ర స‌ృష్టించింది. దీంతో అత్యధిక స్కోర్ పరంగా ఇప్పటివరకు ఉన్న ప్రపంచ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో 427 పరుగులు చేసిన అర్జెంటీనా.. పొట్టి ఫార్మాట్లో 400కు పరుగులు చేసిన తొలి జట్టుగా అవతరించింది. ఈ క్రమంలో గతంలో బహ్రెయిన్ మహిళల జట్టు(318/1)పై ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్దలుకొట్టింది. కాగా పురుషుల క్రికెట్‌లో అత్యధికంగా మంగోలియాపై నేపాల్ క్రికెట్ జట్టు 314/3 పరుగులు చేసింది. అలాగే అర్జెంటీనా 364 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో టీ20 ఫార్మాట్లో పరుగుల పరంగా అతి పెద్ద విజయంగా ఇది ప్రపంచరికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు అర్జెంటీనా ఓపెనర్లు లూసియా టేలర్, అల్బెర్టినా గలాన్ 350 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరు ప్రపంచరికార్డు నెలకొల్పారు. మొత్తంగా ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడిగా చరిత్ర సృష్టించింది. అలాగే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక నో బాల్స్(64), అత్యధిక ఎక్స్‌ట్రా (73) పరుగులు సమర్పించుకున్న జట్టుగా చిలీ చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చిలీ బౌలర్ ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒకే ఓవర్లో ఏకంగా 52 పరుగులు సమర్పించుకుంది. అందులో ఏకంగా 17 నోబాల్స్ ఉన్నాయి. దీంతో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఆమె చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక రెండు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2023-10-15T13:33:53+05:30 IST