YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

ABN , First Publish Date - 2023-03-31T19:22:01+05:30 IST

ఏప్రిల్-3.. (April-3) ఇప్పుడీ తారీఖు చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయ్. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో (YSRCP MLAs) సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

ఏపీలో ముందస్తు ఎన్నికలు (Early Elections) రానున్నాయా..? తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఫార్ములాను సీఎం వైస్ జగన్ (CM YS Jagan) కూడా ఫాలో అవుతున్నారా..? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, వైసీపీ నుంచి నలుగురు సస్పెన్షన్‌తో పాటు ఇటీవల ఏపీ రాజకీయాల్లో (AP Politcs) జరిగిన పరిణామాలతో ఇక ముందస్తుకు వెళ్లాల్సిందే అని జగన్ ఫిక్స్ అయ్యారా..? త్వరలోనే ఏపీ అసెంబ్లీని (AP Assembly) రద్దు చేయనున్నారా..? అసెంబ్లీ రద్దు, ముందస్తుపై ప్రకటన అంతా ఒకే రోజు ఉంటుందా..? ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలని.. ఎవరికీ ఊహకందని రీతిలో జగన్ మాస్టర్ ప్లాన్ (Jagan Master Plan) వేశారా..? అంటే గత కొన్నిరోజులుగా జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు, తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఇంతకీ ఈ విషయాలన్నింటిపై జగన్ ఎప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది..? ఈ ప్రకటనలన్నీ వైసీపీకి ‘బిగ్ డే’ (Big Day) కానున్నాయా..? అసలు ఆ రోజు జగన్ ఏమేం ప్రకటించవచ్చు అనే విషయాలపై ప్రత్యేక కథనం.

YS-Jagan.jpg

ఇంతకీ ఎప్పుడా రోజు.. ఏం జరుగుతుంది..!?

ఏప్రిల్-3.. (April-3) ఇప్పుడీ తారీఖు చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయ్. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో (YSRCP MLAs) సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో భాగంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’, ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ, ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలపై చర్చ జరగనుంది. దీంతో పాటు పలు ముఖ్య విషయాలపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చిస్తారని.. అదే రోజున కీలక ప్రకటనలు కూడా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన రివ్యూ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని, గడపగడపకు వెళ్లాలని కీలక సూచనలే చేశారు. అంతేకాదు.. ఏప్రిల్‌లో జరిగే కీలక సమావేశంలో ఎమ్మెల్యే టికెట్లపై స్పష్టత ఇస్తానని సీఎం ప్రకటించేశారు. అయితే ఆ ప్రకటనకు సమయం రానే వచ్చింది. మరో మూడ్రోజుల్లో అసలు వైసీపీ నుంచి ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేయబోతున్నారు..? ఎవరెవరికి జగన్ టికెట్ ఇవ్వబోతున్నారు..? ఎవరెవరికి హ్యాండ్ ఇవ్వబోతున్నారనే విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టికెట్ రానివారు తనతో కలిసి ఉంటారా లేకుంటే వేరే పార్టీలోకి వెళ్లిపోతారా అనేది కూడా తేల్చుకోవాలని అదే రోజున జగన్ తేల్చిచెప్పేస్తారని వైసీపీ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. తనపై నమ్మకం, గెలుపుపై సందేహాలు ఉన్న నేతలంతా నిర్ధాక్ష్యణ్యంగా వెళ్ళిపోవచ్చని హెచ్చరించే అవకాశాలు లేకపోలేదని వైసీపీ పెద్దలు చెప్పుకుంటున్నారట. దీంతో ఏప్రిల్-3న ఏం జరుగుతుందో అని వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌‌లల్లో నరాలు తెగే టెన్షన్ మొదలైందట.

YSRCP-MLAS-Full.jpg

ముందస్తు తప్పదా..!

ఏపీలో ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ పెద్ద పెద్ద వ్యూహాలే రచించింది. అయితే వైసీపీకి ఊహకందని రీతిలో టీడీపీ విజయడంఖా మోగించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ ఢీలా పడిపోయింది. అటు పట్టభద్రులు అధికార పార్టీని కాదనటం, ఇటు సొంత ఎమ్మెల్యేలే పార్టీ లైన్‌ దాటి క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ గెలవాల్సిన ఏడో ఎమ్మెల్సీ సీటు చేజేతులారా కోల్పోవడంతో ఈ పరిణామాలన్నీ జగన్‌కు మింగుడు పడటం లేదట. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై అసంతృప్తి గళం వినిపిస్తుండటం, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు మారిపోతుండటం, గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో కూడా ఇప్పుడు దెబ్బ కొడుతుండటం, వీటన్నింటిని నిశితంగా పార్టీ పెద్దలతో సమీక్షించిన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మాస్టర్ ప్లాన్ వేశారట. ఇప్పట్లో ముందస్తుకు వెళ్లడంతోనే తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టొచ్చని.. ఈ ప్రకటనను అసలెవరూ ఊహించలేరని జగన్ మనసులో ఉందట. సరిగ్గా ఇదే సమయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో (AP Governer Abdul Nazeer) భేటీ కావడం, ఆ తర్వాత రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు హస్తిన టూర్‌కు జగన్ వెళ్లడంతో (CM Jagan Delhi Tour) ఇవన్నీ ముందస్తుకు సంకేతాలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షాలతో (Home Minister Amit Shah) రెండుసార్లు ముందస్తు గురించే చర్చించారని.. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే సీఎం జగన్ సర్వం సిద్ధం చేసుకున్నారని.. ఇక అసెంబ్లీ రద్దు అని అధికారిక ప్రకటన చేయడమే తరువాయి అని వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

Jagan-and-PK.jpg

ఐ ప్యాక్ నిర్ణయాలు కాదంటున్నారా..!?

వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఐ ప్యాక్ టీమ్ (I-PAC) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఆఖరికి అరాచకాలకు కూడా పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసిన ఐ ప్యాక్ టీమ్.. కొన్ని నివేదికలను జగన్‌కు అందజేసి కీలక సూచనలు, సలహాలు ఇచ్చిందట. ఇందులో కొందరు మంత్రులు, 20 నుంచి 30 వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నివేదికల్లో ఉందట. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక్కరంటే ఒక్కరినీ కూడా మార్చే ప్రసక్తే లేదని.. అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ జంకుతున్నారట. అసలు ఐ ప్యాక్ నిర్ణయాలను కాదని తన సొంత ప్రయోగమే చేయాలని జగన్ భావిస్తున్నారట. మరోవైపు.. జగన్ కచ్చితంగా 10 నుంచి 20 మంది సిట్టింగ్‌లను మార్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయట. ఒకవేళ ఇదే నిజమైతే ఆ సిట్టింగ్‌లు ఎవరో..? ఎవరి సీటుకు ఎసరు పడుతుందో..? ఇంకెవరికి ఎమ్మెల్యే సీటు దక్కుతుందో..? అని వైసీపీలో పెద్ద చర్చే జరుగుతోందట.

Why-not-175.jpg

వైనాట్ 175 కాదు.. నినాదం మారిందట..!

నిన్న, మొన్నటి వరకు వైఎస్ జగన్‌తో పాటు ద్వితియ శ్రేణి నేతల వరకూ ఎవరి నోట చూసినా వినిపించిన మాట ‘వై నాట్ 175’ (Why Not 175). ఎవరు మీడియా ముందుకొచ్చినా మొదట ఆ నేత నుంచి వచ్చే మాట ఇదే. బహిరంగ సభల్లో పదే పదే ‘వై నాట్ 175’ అనే వైఎస్ జగన్ ఈ మధ్య ఎందుకో ఆ ప్రస్తావనే తీసుకురావట్లేదు. ఎందుకంటే ‘వై నాట్ 175’ సంగతి దేవుడెరుగు.. మొదట గెలిచి, పార్టీని అధికారంలోకి వస్తే చాలన్నది ఇప్పుడు జగన్ మనసులో ఉందట. అంటే ‘వై నాట్ 175’ నినాదం మూలపడిందన్న మాట. అది కాస్త గెలిస్తే చాలు మహాప్రభో అనే పరిస్థితికి వెళ్లిందన్న మాట.

YSRCP-MLAS.jpg

సస్పెండ్ చేసి తప్పుచేశారా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటారని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) , ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి అధిష్ఠానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పరిస్థితేంటి..? ఉప ఎన్నికలో వైసీపీ గెలిస్తే సరే.. ఫలితాలు కాస్త అటు ఇటు వస్తే..? ఇక పార్టీ పని అయిపోయినట్లేనని కచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవలేదని జనాల్లో టాక్ వచ్చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అందుకే బై పోల్ ప్రస్తావన వచ్చేలోపే ముందస్తుకు వెళ్లడమే మంచిదని జగన్ ఆలోచనట. వాస్తవానికి ఆ నలుగుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయి ఉంటేనే బాగుండేదని జగన్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట. అవును సార్.. అనవసరంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి తప్పు చేశారని కొందరు వైసీపీ పెద్దలు సైతం జగన్‌కు చెబుతున్నారట.

Why-not-175-2.jpg

బిగ్ డే.. బిగ్ డెసిషన్స్!

చూశారుగా.. ఏప్రిల్-3 తారీఖు చుట్టూ ఎన్నెన్ని విషయాలు తిరుగుతున్నాయో..! మొత్తానికి చూస్తే.. ఏప్రిల్-3 అనేది ఇప్పుడు వైసీపీకి బిగ్ డే (Big Day For YSRCP) అన్న మాట. ఆ రోజున పెద్ద పెద్ద నిర్ణయాలే జగన్ తీసుకోబోతున్నారని వార్తలు గుప్పుమనడంతో ఆ తారీఖు చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీ శ్రేణులు మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఊహకందని రీతిలో ఝలక్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారని చెప్పుకుంటున్నాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. జగన్ ఏమేం నిర్ణయాలు తీసుకుంటారో.. కేసీఆర్ లాగా ముందస్తు రాగం అందుకుంటారనేది..? తెలియాలంటే మరో మూడ్రోజులు వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-03-31T19:32:05+05:30 IST