Judgement Day : చంద్రబాబు కేసులో రేపు ఏం జరగబోతోంది.. లోకేష్ ఏం చేస్తున్నారు.. సర్వత్రా ఉత్కంఠ..!

ABN , First Publish Date - 2023-10-08T17:55:10+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..

Judgement Day : చంద్రబాబు కేసులో రేపు ఏం జరగబోతోంది.. లోకేష్ ఏం చేస్తున్నారు.. సర్వత్రా ఉత్కంఠ..!

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు.. ఆయన బెయిల్ పిటిషన్లపై సోమవారం నాడు సుప్రీంకోర్టు (Supreme Court), ఏపీ హైకోర్టు (AP High Court), ఏసీబీ కోర్టుల (ACB Court) నుంచి కీలక తీర్పులు వెలువడనున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్ రెడ్డి నిర్ణయం వెల్లడించబోతున్నారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.


CBN.jpg

సర్వత్రా ఆసక్తి.. అంతకుమించి ఉత్కంఠ!

స్కిల్ అక్రమ కేసులో చంద్రబాబు అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో బాబుకు రిమాండ్ విధించి దాదాపు నెలరోజులవుతోంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఇక.. ఇదే కేసులో తనకు బెయిల్ (Chandrababu Bail) మంజూరు చేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సోమవారం నాడే (అక్టోబర్-09న) తీర్పు వెల్లడించనుంది. అలాగే టీడీపీ అధినేతను మరోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పైనా ఉత్తర్వులు జారీ చేయనుంది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై శుక్ర వారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందో లేదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Chandrababu.jpg

తీర్పు ఎలా ఉంటుందో..?

కాగా.. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటే దాదాపు కింది కోర్టులు సైతం తీర్పులను రిజర్వులో పెడతాయన్న విషయం తెలిసిందే. అయితే.. రేపు సుప్రీం తీర్పు వెల్లడించిన తర్వాత కింది కోర్టుల తీర్పులు కూడా వెలువడనున్నాయి. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది..? ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల నుంచి ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై టీడీపీ శ్రేణులు, చంద్రబాబు వీరాభిమానులు న్యాయస్థానాలవైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతా మంచే జరగాలని.. క్వాష్ పిటిషన్‌కు అనుకూలంగానే తీర్పు రావాలని తెలుగు తమ్ముళ్లు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ మూడు తీర్పుల్లో ముఖ్యంగా హైకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపైనే టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్‌గా ఉంది.

NCBN-SUPREME.jpg

ఢిల్లీలోనే లోకేష్..

సీఐడీ నుంచి నోటీసులు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఈనెల 5న ఏపీకి వచ్చిన యువనేత నారా లోకేష్ (Nara Lokesh) .. మరుసటిరోజే చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు. కుటుంబ సభ్యులతో 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బెయిల్‌పై ఎలా ముందుకెళ్లాలి..? ఎవరెవర్ని సంప్రదించాలి..? ఢిల్లీ వేదికగా ఏం చేయాలనే దానిపై చినబాబుకు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బాబు సలహాలు, సూచనలు స్వీకరించిన లోకేష్.. ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా సరే నాన్నను నిర్దోషిగా.. బెయిల్‌పై బయటికి తీసుకురావాలన్న తపనతో లోకేష్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు.. సీఐడీ విచారణకు వచ్చి ఆ తర్వాత మళ్లీ హస్తినకు యువనేత వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు.. బాబుకు బెయిల్ మంజూరై, సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన రోజే లోకేష్ కూడా ఢిల్లీ నుంచి ఏపీకి వస్తారనే టాక్ కూడా టీడీపీలో నడుస్తోంది.

lokesh-202-day.jpg

మొత్తానికి చూస్తే.. అక్టోబర్-09 అనేది చంద్రబాబు కేసుల విషయంలో ‘జడ్జిమెంట్ డే’ గా (Judgement Day) భావించొచ్చు. సుప్రీంకోర్టులో ‘క్వాష్‌ పిటిషన్’ పై.. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై.. ఇక హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ విషయంలో తీర్పు ఎలా ఉంటుందో ఏంటో వేచి చూడాలి మరి. అయితే అంతా మంచే జరుగుతుందని మాత్రం టీడీపీ శ్రేణులు చాలా ధీమాగానే ఉన్నాయి.

Law.jpg

Updated Date - 2023-10-08T18:04:39+05:30 IST