US Visas: భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అగ్రరాజ్యం అమెరికా..!

ABN , First Publish Date - 2023-09-29T10:33:19+05:30 IST

భారత్ నుంచి చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారిలో అత్యధికంగా వెళ్లేది మాత్రం అగ్రరాజ్యం అమెరికాకే. అందుకే యూఎస్‌లో ఉండే విదేశీయుల జాబితాలో భారతీయులు (Indians) రెండో స్థానాన్ని అక్రమించారు.

US Visas: భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అగ్రరాజ్యం అమెరికా..!

ఎన్నారై డెస్క్: భారత్ నుంచి చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారిలో అత్యధికంగా వెళ్లేది మాత్రం అగ్రరాజ్యం అమెరికాకే. అందుకే యూఎస్‌లో ఉండే విదేశీయుల జాబితాలో భారతీయులు (Indians) రెండో స్థానాన్ని అక్రమించారు. ఇలా ఇండియా నుంచి ప్రతియేటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని అమెరికన్ ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారతీయులకు 10 లక్షల వీసాలు జారీ చేసినట్లు యూఎస్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అమెరికన్ ఎంబసీ (American Embassy) తన అధికారిక 'ఎక్స్‌' (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేసింది. "ఈ ఏడాది మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలన్న మా లక్ష్యం నెరవేరింది. రాబోయే కాలంలో మరింత పురోగతి సాధిస్తాం. మరింత ఎక్కువ మంది భారతీయులు అమెరికాను సందర్శించే అవకాశం కల్పిస్తామని" రాయబార కార్యాలయం తన ట్వీట్‌లో పేర్కొంది.

అలాగే భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) మాట్లాడుతున్న వీడియోను కూడా జత చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మిషన్ 1మిలియన్'లో భాగంగా 10లక్షల వీసాలు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్‌తో అమెరికాకు అత్యంత కీలకమైన బంధం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. గతేడాది 12 లక్షల మంది భారతీయులు యూఎస్‌ను సందర్శించారని తెలిపారు. అలాగే 2019తో పోలిస్తే 20 శాతం అధిక దరఖాస్తులను పరిష్కరించామని రాయబారి చెప్పారు. కాగా, అగ్రరాజ్యం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జారీ చేసిన వీసాలలో 10 శాతం భారతీయులకే దక్కడం గమనార్హం. వీటిలో విద్యార్ధి వీసాలు 20 శాతం, హెచ్, ఎల్, కేటగిరీ ఉద్యోగ వీసాల్లో 65 శాతం మనోళ్లకే మంజూరయ్యాయి.

ఇక వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేసేందుకు సిబ్బందిని విస్తరిస్తున్నామని తెలిపింది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కొత్త కాన్సులేట్ భవనాలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. భారతీయుల వీసాలను మరిన్ని ప్రాసెస్ చేసేందుకు యూఎస్ అంగీకరించింది. అలాగే వీసా జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు అమెరికా, భారత్ సంయుక్తంగా అనేక చర్యలు చేపట్టాయి. హెచ్-1బీ వీసా (H-1b Visa) పునరుద్ధరణ కోసం భారతీయులు ఇకపై అమెరికాను వీడాల్సిన అవసరం లేదని మోదీ తన అగ్రారాజ్య పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. బెంగళూరు, అహ్మదాబాద్‌లో నూతన కాన్సూలేట్లను ప్రారంభించబోతున్నట్టు అమెరికా కూడా ప్రకటించింది. అంతేగాక మరో రెండు అమెరికా నగరాల్లో దౌత్యకార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు భారత్‌ కూడా సిద్ధమైంది.

Dubai Duty Free Raffle: భార‌తీయుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ. 8.22కోట్లు!

Updated Date - 2023-09-29T10:44:51+05:30 IST