NRI: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సిడ్నీలో ప్రవాసాంధ్రుల నిరసన

ABN , First Publish Date - 2023-09-19T08:50:39+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

NRI: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సిడ్నీలో ప్రవాసాంధ్రుల నిరసన

సిడ్నీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కూడా తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు ఆదివారం మౌన ప్రదర్శనలు, నిరాహారదీక్షలు చేపట్టారు. నగరంలోని ప్రసిద్ధ ఓపెరా హౌస్, పర్రమట్టాలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగువారు భారీగా చేరుకుని చంద్రబాబుకి సంఘీభావంగా 'జస్టిస్ ఫర్ బాబు', 'ఐ యామ్ విత్ సిబియన్' ప్లకార్డులతో మౌనప్రదర్శన నిర్వహించారు. అంతేకాకుండా బౌల్ఖం హిల్స్‌‌లో తెలుగుదేశం ఆస్ట్రేలియా సభ్యులు ఉదయం నుండి నిరాహారదీక్షలు చేపట్టారు.

SSSS.jpg

పార్టీలకీ, ప్రాంతాలకీ అతీతంగా చంద్రబాబు అభిమానులు కుటుంబసభ్యులతో సహా వచ్చి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్దే ధ్యేయంగా 45 ఏళ్లపాటు మచ్చలేని ప్రజాజీవితాన్ని గడిపిన చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్టులు చేయటాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించారు.

SSSSSSS.jpg

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి రాబోయే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించి సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల అవినీతి కేసుల్లో ఏ1 నిందితునిగా ఉన్న జగన్ తన చుట్టూ ఉన్న అందరికి అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు.

SSSSSS.jpg

వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు చంద్రబాబు విజన్, చేపట్టిన సంక్షేమ పధకాల ద్వారా తెలుగు ప్రజానీకం ఏ విధంగా లబ్ది పొందిందో గుర్తు చేశారు. ఈ సమయంలో చంద్రబాబుకి అండగా నిలవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జగన్ ప్రభుత్వానికి, వ్యవస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. స్థానిక తెలుగు ప్రముఖులు నిమ్మరసం అందించి నిరాహారదీక్షలను విరమింపజేశారు.

SS.jpg

తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. అక్రమ కేసులు అరెస్టులతో తమ నాయకుడిని, పార్టీ కార్యకర్తలని భయపెట్టలేరని అన్నారు. దీనికి తగిన సమాధానం రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబుకి త్వరలోనే న్యాయం జరిగి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చి బాబుకి సంఘీభావం తెలియచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

SSS.jpg

S.jpg

Updated Date - 2023-09-19T08:50:39+05:30 IST