Modi and Stallin : మోదీ దగ్గర ఆ కళ నేర్చుకున్నాను : స్టాలిన్

ABN , First Publish Date - 2023-02-14T18:08:11+05:30 IST

జాతీయ మీడియా కథనాల ప్రకారం, స్టాలిన్ మంగళవారం ప్రధాని మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Modi and Stallin : మోదీ దగ్గర ఆ కళ నేర్చుకున్నాను : స్టాలిన్
Narendra Modi, MK Stallin

చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నుంచి తాను ఓ కళను నేర్చుకున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stallin) అన్నారు. మోదీ, బీజేపీలపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి సమాధానం చెప్పకుండా పార్లమెంటులో గంటకుపైగా మాట్లాడారన్నారు. ప్రజల నమ్మకమే తనకు రక్షణ కవచమని ఆయన చెప్తున్నారని, ప్రజలు మాత్రం అలా అనుకోవడం లేదని అన్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, స్టాలిన్ మంగళవారం ప్రధాని మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, తదితర పార్టీలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, కేవలం మాటల గారడీ చేస్తున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా గంటల తరబడి ఎలా మాట్లాడాలో తాను మోదీ నుంచి నేర్చుకున్నానన్నారు. మోదీ, బీజేపీలపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. మోదీ మాత్రం దేనికీ సమాధానం చెప్పలేదన్నారు. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చినపుడు మోదీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. ఆయన ప్రసంగమంతా వాగాడంబరమేనని, మాటల గారడీయేనని వ్యాఖ్యానించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో మోదీ పోషించిన పాత్ర, అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం వంటివాటిపై వచ్చిన ఆరోపణలకు, ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు.

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు నేరుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినవేనని తెలిపారు. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నలు న్యాయమైనవి, సరైనవి అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మోదీ కనీసం ఒక మాట అయినా మాట్లాడకపోవడం దిగ్భ్రాంతికరమని తెలిపారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై స్టాలిన్ మాట్లాడుతూ, రికార్డుల నుంచి తొలగించినంత మాత్రానికి వాటిని ప్రజల మనసుల నుంచి తొలగించడం సాధ్యం కాదన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొస్తోందని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నానని మోదీ మొట్టమొదటిసారి పార్లమెంటులో అంగీకరించారన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది శ్రేయస్కరం కాదన్నారు.

డీఎంకే అడిగిన ప్రశ్నలకు కూడా మోదీ సమాధానాలు చెప్పలేదన్నారు. సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ గురించి అడిగిన ప్రశ్నకు మోదీ స్పందించలేదన్నారు. 2007 నుంచి ఆగిపోయిన ఈ ప్రాజెక్టును తక్షణమే అమలు చేయాలన్నారు. NEET పరీక్షల్లో మినహాయింపు కోసం ప్రతిపాదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, రాష్ట్రాల హక్కులు, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటుండటం, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం వంటివాటిపై మోదీ మాట్లాడలేదన్నారు.

తమిళనాడు గురించి చెప్పడానికేమీ మోదీ వద్ద లేదన్నారు. డీఎంకే సభ్యులు సరైన ప్రశ్నలు అడిగారన్నారు. ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చారో మోదీ చెప్పలేదన్నారు.

శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును గవర్నర్ రవి అవమానిస్తున్నారన్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌లో చిక్కుకున్నవారిలో నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు చెప్పిందన్నారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌‌ను రవి ఆమోదించారని, బిల్లును మాత్రం ఆమోదించడం లేదని చెప్పారు.

అమిత్ షా స్పందన

రాహుల్ గాంధీ, ఖర్గే పార్లమెంటులో చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా (Amit Shah) స్పందిస్తూ, పార్లమెంటరీ భాషను ఉపయోగించి, నిబంధనలకు అనుగుణంగా చర్చలు జరిపేందుకే లోక్‌సభ, రాజ్యసభ ఉన్నాయన్నారు. పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం ఇదే మొదటిసారి కాదన్నారు.

హిండెన్‌బర్గ్ (Hindenburg) నివేదికపై అదానీ గ్రూప్‌ (Adani Group) స్పందిస్తూ, తమ కార్యకలాపాలపై ఎటువంటి పరిశోధన లేకుండా, దురుద్దేశపూర్వకంగా ఈ నివేదికను ఇచ్చారని ఆరోపించింది.

Updated Date - 2023-02-14T18:12:35+05:30 IST