Sengol Row : బీజేపీ ఓటమిని అంగీకరించింది : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2023-05-26T16:46:10+05:30 IST

అధికార మార్పిడికి గుర్తుగా నిలిచే చరిత్రాత్మక రాజదండాన్ని నూతన పార్లమెంటు భవనంలో అమర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

Sengol Row : బీజేపీ ఓటమిని అంగీకరించింది : అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav, Amit Shah

న్యూఢిల్లీ : అధికార మార్పిడికి గుర్తుగా నిలిచే చరిత్రాత్మక రాజదండాన్ని నూతన పార్లమెంటు భవనంలో అమర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా తన గళాన్ని బలంగా వినిపించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ఈ రాజదండాన్ని మన దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఇచ్చినట్లు చెప్తున్నారు. దీనిని నెహ్రూ వాకింగ్ స్టిక్ అంటూ ఓ మ్యూజియంలో పెట్టారు. దీనిని అత్యంత గౌరవప్రదంగా నూతన పార్లమెంటు భవనంలో పెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

తమిళనాడు సంప్రదాయ పద్ధతిలో తయారైన ఈ రాజదండం (Sengol)ను నూతన పార్లమెంటు భవనంలో పెట్టాలనే నిర్ణయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. ఈ రాజదండాన్ని ఉపయోగించాలని బీజేపీ నిర్ణయించడంతో ఆ పార్టీ తన ఓటమిని అంగీకరించినట్లయిందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అఖిలేశ్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, రాజదండం అనేది అధికార మార్పిడికి చిహ్నమని పేర్కొన్నారు. అధికారాన్ని అప్పగించవలసిన సమయం ఆసన్నమైందని బీజేపీ అంగీకరించినట్లు కనిపిస్తోందన్నారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించబోతున్నారు. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కాంగ్రెస్ సహా సుమారు 20 ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి.

ఆధారాలు లేవు!

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఇచ్చిన ట్వీట్‌లో, బ్రిటిష్ అధికారాన్ని భారత దేశానికి బదిలీ చేయడానికి గుర్తుగా రాజదండాన్ని ఇచ్చినట్లు సాక్ష్యాధారాలు లేవని చెప్పారు. మౌంట్‌బాటన్, రాజాజీ, నెహ్రూ దీని విషయంలో ఏం చేశారో తెలిపే పత్రాలేవీ లేవన్నారు. దీని గురించి చెప్తున్నవన్నీ బోగస్ అన్నారు. కొందరి మదిలో తయారైన విషయాన్ని వాట్సాప్ ద్వారా వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి తప్పుడు కథనాలను నూతన పార్లమెంటుకు సమర్పిస్తుండటంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కనీస ఆధారాలు లేకుండా గొప్పలు చెప్పుకోవడంలో బీజేపీ, ఆరెస్సెస్ డిస్టోరియన్స్ గుట్టు మరోసారి రట్టయిందన్నారు.

కాంగ్రెస్‌కు ఎందుకీ ద్వేషం?

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ ఎందుకు అంతగా ద్వేషిస్తుందని ప్రశ్నించారు. పవిత్రమైన రాజదండాన్ని తమిళనాడులోని పవిత్రమైన శైవ సంప్రదాయ మఠం భారత దేశ స్వాతంత్ర్యానికి గుర్తుగా పండిట్ నెహ్రూకు ఇచ్చిందన్నారు. కానీ దీనిని వాకింగ్ స్టిక్ అంటూ మ్యూజియానికి తరలించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మరో సిగ్గుచేటు అయిన అవమానానికి ఒడిగట్టిందని దుయ్యబట్టారు. తిరువడుతురై ఆధీనం అత్యంత పవిత్రమైన శైవ సంప్రదాయ మఠమని, ఈ రాజదండానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో ఉన్న ప్రాధాన్యాన్ని ఆ మఠం స్వయంగా వివరించిందని చెప్పారు. ఈ ఆధీనం చరిత్ర బోగస్ అని కాంగ్రెస్ అంటోందని, ఇది అత్యంత అవమానకరమని తెలిపారు. తమ ప్రవర్తన ఎలా ఉందో కాంగ్రెస్ పరిశీలించుకోవలసిన అవసరం ఉందన్నారు.

సమన్యాయంతో కూడిన పాలన

కొత్త పార్లమెంట్‌లో సభాపతి సమీపాన రాజదండాన్ని అమర్చనుండటం రాష్ట్రానికే గర్వకారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) పేర్కొన్నారు. పాలకులు ఏకపక్షంగా కాకుండా అందరికీ సమన్యాయంతో కూడిన పాలన అందించాలని ఎల్లప్పుడూ గుర్తు చేసే అధికారిక చిహ్నంగా ఈ రాజదండం ఉంటుందన్నారు.

ఇదిలావుండగా, నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేత ప్రారంభింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను ఎందుకు దాఖలు చేశారో తమకు తెలుసునని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం తెలిపింది. దీనిని రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ జయ సుకిన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి

New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Updated Date - 2023-05-26T16:46:10+05:30 IST