Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి

ABN , First Publish Date - 2023-05-26T15:23:34+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి ఢిల్లీ కోర్టులో కాస్త ఊరట లభించింది.

Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి
Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)కి ఢిల్లీ కోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయన ‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తీర్పు వెలువడి, ఆయనకు రెండేళ్ల శిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన డిప్లమేటిక్ పాస్‌పోర్టును అధికారులకు అప్పగించారు. అనంతరం పాస్‌పోర్టును పొందేందుకు తనకు నిరభ్యంతర ధ్రువపత్రం (NOC)ని మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మూడేళ్లపాటు రెగ్యులర్ పాస్‌పోర్టును పొందేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది.

పదేళ్లకు రెగ్యులర్ పాస్‌పోర్టును పొందేందుకు ఎన్ఓసీని జారీ చేయాలని రాహుల్ గాంధీ కోరారు. అయితే కోర్టు ఆయనకు మూడేళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ నిందితుడు కావడంతో పాస్‌పోర్టు పొందడానికి ఎన్ఓసీ అవసరమైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్, నిధుల దుర్వినియోగం జరిగినట్లు కేసు నమోదైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ కేసు నమోదైంది. కాబట్టి ఎన్ఓసీ జారీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని, దీనికి సమాధానాన్ని శుక్రవారంనాటికి సమర్పించాలని కోర్టు స్వామిని ఆదేశించింది.

ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా తెలిపారు. గతంలో అనుమతి లేకుండానే రాహుల్ గాంధీ చాలాసార్లు విదేశాలకు వెళ్లి, వచ్చారని, ఆయనపై కోర్టులు ఎటువంటి ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు. 2015 డిసెంబరులో గాంధీకి బెయిలు మంజూరు చేసినపుడు కోర్టు ఆయన ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలను విధించలేదన్నారు. ఆయన ప్రయాణాలపై ఆంక్షలు విధించాలని స్వామి కోరినప్పటికీ, కోర్టు తిరస్కరించిందన్నారు.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని సూరత్ కోర్టు తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ కంప్లయింట్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు నమోదైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరు మోసం, కుట్ర, నేరపూరిత నమ్మకద్రోహం నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్లిష్ దినపత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అనే కంపెనీ ముద్రిస్తూ ఉండేది. ఈ పత్రిక ప్రస్తుతం రావడం లేదు. ఈ పత్రిక యాజమాన్యాన్ని సంపాదించడంలో మోసం, కుట్ర, నిదుల దుర్వినియోగం జరిగినట్లు సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపించారు. ఏజేఎల్ రుణాలను యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే కంపెనీ స్వాధీనం చేసుకుంది. దీనిని 2010లో ఏర్పాటు చేశారు. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో డైరెక్టర్లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు వ్యవహరించేవారు.

కాంగ్రెస్ పార్టీకి ఏజేఎల్ రూ.90.25 కోట్లు బాకీ పడిందని, దీనిని వసూలు చేసుకోవడం కోసం సోనియా, రాహుల్, తదితరులు డైరెక్టర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించిందని సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపించారు. ఏజేఎల్ నుంచి రూ.90.25 కోట్లను రాబట్టుకునే హక్కును యంగ్ ఇండియన్ పొందిందన్నారు.

ఇవి కూడా చదవండి :

Kishan Reddy: బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా?

New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Updated Date - 2023-05-26T15:23:34+05:30 IST