Floods: రాష్ట్రంలో పెరుగుతున్న వరద బాధిత మృతుల సంఖ్య.. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?

ABN , First Publish Date - 2023-10-07T12:27:56+05:30 IST

కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో సిక్కిం రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి కారణంగా చుంగ్‌తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. నది ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి.

Floods: రాష్ట్రంలో పెరుగుతున్న వరద బాధిత మృతుల సంఖ్య..  ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?

గ్యాంగ్‌టక్: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో సిక్కిం రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి కారణంగా చుంగ్‌తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. నది ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది సహా వందల మంది గల్లంతయ్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వరదల్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56కి చేరింది. సిక్కిం నుంచి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యం కాగా, పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్మీ సిబ్బందితో సహా వరదల్లో గల్లంతైన 142 మంది కోసం సిక్కింలోని తీస్తా నది ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాలలో అన్వేషణ కొనసాగుతోంది. సిక్కింలో ఇప్పటివరకు 26 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు ధృవీకరించారు. మంగన్ జిల్లాలో నాలుగు, గ్యాంగ్‌టక్‌లో ఆరు, పాక్యోంగ్ జిల్లాలో ఏడుగురు ఆర్మీ సిబ్బందితో సహా 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు మృత్యుఘోష కొనసాగుతుండగా మరోవైపు సిక్కింలో రానున్న 5 రోజులపాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది.


పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం తీస్తా నది పరీవాహక ప్రాంతంలోని సిలిగురి, జల్పైగుర, కూచ్ బెహార్ అనే మూడు జిల్లాలో 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మకాగా వరదల్లో మందుగుండు సామగ్రి సహా సైనిక పరికరాలు కొట్టుకుపోయాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. "సిక్కింలో తీవ్ర వరదల కారణంగా తుపాకీలు, పేలుడు పదార్థాలతో సహా కొన్ని సైనిక పరికరాలు తీస్తా నదిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే జల్‌పైగురి జిల్లా అధికారులు ప్రజల కోసం అత్యవసర నోటీసు జారీ చేశారు. నది దిగువన ఆర్మీ లుకౌట్ బృందాలను ఏర్పాటు చేసింది" అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వరదల్లో ఇప్పటివరకు 25,000 మంది ప్రజలను ప్రభావితం అయ్యారు. 1,200 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. 13 వంతెనలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయాయి. కాగా వరదల్లో చిక్కుకున్న 2,413 మందిని వివిధ ప్రాంతాల నుంచి రక్షించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 సహాయ శిబిరాల్లో 6,875 మంది ఆశ్రయం పొందుతున్నారు.

మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు. అలాగే శిబిరాల్లో తలదాచుకుంటున్న వారందరికీ తక్షణ సాయంగా రూ.2,000 చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) కేంద్ర వాటా నుంచి అడ్వాన్స్‌గా రూ. 44.8 కోట్ల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. వరదల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటివరకు 3,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా వారిని ఇంకా రక్షించలేదు.

Updated Date - 2023-10-07T12:27:56+05:30 IST