Rahul Gandhi : రాహుల్ గాంధీకి శిక్షపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-25T19:18:53+05:30 IST

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)కి రెండేళ్ళ జైలు శిక్ష

Rahul Gandhi : రాహుల్ గాంధీకి శిక్షపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi , Prashant Kishor

పాట్నా : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)కి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం సరికాదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) అన్నారు. ఇది తప్పు అని సామాన్య జనాలకు తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా సిద్ధం కాలేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి (Atal Bihari Vajpayee) గతంలో చెప్పిన మాటలను గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ నేరస్థుడనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. ‘‘దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అని ఎలా ఉంటోందబ్బా!’’ అన్నారు. దీంతో ఆయనపై వివిధ రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. గుజరాత్‌లోని పశ్చిమ సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ (Surat West MLA Purnesh Modi) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తీర్పు చెప్పింది. రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అమలును 30 రోజులపాటు నిలిపేస్తూ, బెయిలు మంజూరు చేసింది. ఈ తీర్పుపై అపీలు చేసేందుకు ఆయనకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ పార్లమెంటుకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్లమెంటు సచివాలయం గాంధీపై అనర్హత వేటు వేసింది. ఫలితంగా ఆయన కేరళలోని వయనాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఓ వార్తా సంస్థతో శనివారం మాట్లాడుతూ, ఓ పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష అనేది చాలా ఎక్కువ అని తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పాయి గతంలో చెప్పిన మాటలను కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటున్నానని చెప్పారు. ‘‘సంకుచిత హృదయంగలవారు గొప్పవారు కాలేరు’’ అని వాజ్‌పాయి అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ దోషి అని వెలువడిన తీర్పును, సాంకేతిక అంశాలను చూపించి, అధికార పార్టీ దాక్కొనవచ్చునని, ఆయనపై అనర్హత వేటు అనివార్యమైనదని చెప్పవచ్చునని, అయితే దివంగత వాజ్‌పాయి పుస్తకంలోని ఓ మాటను అధికార పార్టీ పెద్దలు గుర్తు చేసుకోవలసిందని అన్నారు. రాహుల్ గాంధీని అనర్హుడిని చేయడానికి తొందరపడకుండా ఉండవలసిందని అన్నారు.

‘‘నేడు వారు (బీజేపీ) అధికారంలో ఉన్నారు. విశాల హృదయాన్ని చూపించవలసిన భారం వారిపైనే ఉంది. కొద్ది రోజులపాటు వేచి చూసి, బాధిత పక్షం అపీలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉండవలసింది, ఎటువంటి ఉపశమనం కనిపించకపోయినపుడు మాత్రమే చర్య తీసుకుని ఉండవలసింది’’ అన్నారు.

తనకు వ్యతిరేకంగా ఉన్నదేమిటో కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఢిల్లీలో కూర్చుని, ఆగ్రహంతో ట్వీట్లు చేసి, పార్లమెంటుకు నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా రాజకీయ యుద్ధాలు చేయలేమని కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..

Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ

Updated Date - 2023-03-25T19:18:53+05:30 IST