BRS Khammam Meeting: నాలుగు ఫ్రంట్‌లు... నాలుగు దిక్కులు

ABN , First Publish Date - 2023-01-18T21:09:09+05:30 IST

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత తెలంగాణలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జాతీయ స్థాయి నాయకులను పిలవడం ద్వారా ఆ పార్టీ అధినేత...

BRS Khammam Meeting: నాలుగు ఫ్రంట్‌లు... నాలుగు దిక్కులు
BJP

ఖమ్మం: భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావం తర్వాత తెలంగాణలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జాతీయ స్థాయి నాయకులను పిలవడం ద్వారా ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముుఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అందరి దృష్టినీ ఆకర్షించారు. ఢిల్లీ సీఎం, ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం విజయన్‌తో పాటు, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ (SP) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులను ఖమ్మం సభకు ఆహ్వానించి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. ఊహించినట్లే నేతలంతా కేంద్రంలోని మోదీ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. 400 రోజుల్లో మోదీ సర్కారు పోయి కొత్త ప్రభుత్వం రాబోతోందని నేతలంతా జోస్యం చెప్పారు. ఇదే ఏడాది తెలంగాణలో 2024లో లోక్‌సభకు ఎన్నికలు రానుండటంతో ఖమ్మం సభకు, నేతల ప్రసంగాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కేసీఆర్ తమకు పెద్దన్నలాంటి వారని కేజ్రీవాల్ అంటే, బీజేపీని తరిమి కొట్టడం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని అఖిలేష్ ఆకాంక్షించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను మాన్ మెచ్చుకున్నారు. మోదీ రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని వామపక్ష నేతలు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అమలు చేస్తామని, మిషన్ భగీరథ చేపడ్తామని కేసీఆర్ అన్నారు. 2024లో మోదీని ఇంటికి పంపిస్తామని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ సారథ్యంలో నిర్వహించిన ఖమ్మం సభకు తరలిరావడం ద్వారా ఈ నేతలు తామంతా ఒక జట్టు అని ప్రకటించినట్లైంది. సభకు రాకున్నా కర్ణాటకలోని జేడీఎస్, హైదరాబాద్‌లోని ఎంఐఎం కూడా కేసీఆర్ వెంటే ఉన్నాయి. సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడం ద్వారా కేసీఆర్ జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా గట్టి పోటీ ఇస్తామని చెప్పినట్లైంది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని, కేంద్రంలో నిర్ణయాక శక్తిగా మారాలని యోచిస్తోంది. అన్నింటినీ మించి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సమాధి అయితే తన పార్టీయే దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నాయమౌతుందని కేజ్రీవాల్ విశ్వాసం. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో జట్టు కట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. విపక్షాల ప్రధాని అభ్యర్ధి కావాలని ఆయన కలలు కంటున్నారు. కాంగ్రెసేతర పార్టీల్లో ఖమ్మం సభకు హాజరైనవారంతా కేసీఆర్ వెంట ఉన్నారు. అయితే లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్‌తో జత కట్టడానికి అభ్యంతరాలుండవు. కేజ్రీవాల్‌కు, అఖిలేష్‌కు అభ్యంతరం ఉండే అవకాశం ఉంది. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో అధిక సంఖ్యలో సీట్లు గెలిచి ప్రధాని కావాలని అఖిలేష్ కూడా యోచిస్తున్నారు. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటులో కాంగ్రెస్‌తో జత కలిసే విషయంలో అఖిలేష్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు స్వయంగా కేసీఆర్‌కు కూడా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకూ కాంగ్రెస్‌తో గిట్టకపోవచ్చు. ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఏ పక్షాన ఉంటారో, ఎలాంటి టర్న్ తీసుకుంటారో చెప్పడం కష్టమని రాజకీయ పరిశీలకులంటున్నారు.

కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల్లో తృణమూల్ (TMC) అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రధాని కావాలనుకుంటున్నారు. విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నిలవాలని ఆమె తలపోస్తున్నారు. అయితే ఆమె కాంగ్రెస్‌తో జత కట్టే విషయంలో తన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆమె ఈ విషయంలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారు.

బీఎస్పీ (BSP) అధినేత్రి మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ(BJD) అధినేత నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల కూటముల్లో చేరకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక కాంగ్రెస్(Congress) వెంట ఇప్పటికే ఎన్సీపీ(NCP), ఉద్ధవ్ సేన, డీఎంకే(DMK), జేఎంఎం(JMMM), జేడీయూ(JDU), ఆర్జేడీ(RJD) ఉన్నాయి. ఇందులో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌‌కు ప్రధాని కావాలనే కోరిక ఉంది. విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నిలవాలని నితీశ్ కోరుకుంటున్నారు.

ఇక బీజేపీ(BJP) విషయానికొస్తే శిండే సేన మాత్రమే ప్రస్తుతానికి తోడుగా ఉంది. బీజేపీకి 2014, 2019లో సొంతంగా మెజార్టీ రావడంతో విపక్షాల అవసరం పడలేదు. 2024లో 350 స్థానాల్లో గెలిచి తిరిగి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోన్న కమలనాథులు చిన్నాచితకా పార్టీలతో మాత్రం పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. బీహార్‌లో పాశ్వాన్ పార్టీ, యూపీలో అనుప్రియా పటేల్‌ పార్టీ, తమిళనాట అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ బీజేపీకి సొంతంగా 272 మ్యాజిక్ నెంబర్ రాకపోతే కాంగ్రెసేతర పార్టీలైన బీజేడీ, టీఎంసీ, బీఎస్పీ తదితర పార్టీల సాయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మూడోసారి కూడా బీజేపీకి సొంతంగా పూర్తి మెజార్టీ వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసంగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని విపక్షాలు చూస్తున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఏ ఫ్రంట్‌లో ఉంటుందో స్పష్టత వస్తుంది.

Updated Date - 2023-01-18T21:10:33+05:30 IST