Karnataka : కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే

ABN , First Publish Date - 2023-05-18T10:01:52+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై రాజీ కుదిరిందని, దాదాపు నాలుగు రోజుల నుంచి ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడిందని వార్తలు వస్తున్న సమయంలో

Karnataka : కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే
DK Shiv Kumar

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై రాజీ కుదిరిందని, దాదాపు నాలుగు రోజుల నుంచి ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడిందని వార్తలు వస్తున్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 7 గంటలకు క్వీన్స్ రోడ్‌లోని ఇందిరా గాంధీ భవన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరు కావాలని కోరారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని, డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. వీరు ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు ఆ పదవిని డీకే శివ కుమార్ నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి అంగీకారం కుదిరిందనే వార్తలపై స్పష్టత లేదు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే దీనిపై స్పష్టత వస్తుందని కొందరు నేతలు చెప్తున్నారు. డీకే శివ కుమార్ సన్నిహితులు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, సిద్ధూ, డీకే చెరొక రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడంపై స్పష్టత లేదని చెప్పారు. ఈ పదవిని రొటేషన్ పద్ధతిలో నిర్వహించడం గురించి కాంగ్రెస్ అధిష్ఠానం ధ్రువీకరించలేదని చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు దీనిపై చర్చించరాదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శివ కుమార్‌కు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను ఇస్తామని చెప్పినప్పటికీ, ఆ శాఖల గురించి కూడా స్పష్టత రానట్లు తెలుస్తోంది. ఓ ఒప్పందం కుదిరినట్లు మాత్రమే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ స్పష్టత త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య, శివ కుమార్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ని స్వయంగా కలవాలని అనుకున్నప్పటికీ, ఆమె ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి వరకు కాంగ్రెస్ నేతలు చర్చోపచర్చల్లో మునిగిపోయారు. చివరికి సిద్ధూ, డీకే (DK Shiva Kumar) మధ్య రాజీ కుదర్చగలిగినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

డీకే శివ కుమార్ (DK Shiva Kumar) ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అన్యమనస్కంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఉన్నారని సమాచారం. అంతకుముందు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని శివ కుమార్ పట్టుబట్టారు.

ఇవి కూడా చదవండి :

Good New: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పిన సీఎం

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకే!

Updated Date - 2023-05-18T10:01:52+05:30 IST