ఫ్లెక్సీలపై నిషేధం పర్యావరణ హితమా?

ABN , First Publish Date - 2022-11-01T03:08:54+05:30 IST

జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఒక్కో రంగాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీస్తోంది. తాజాగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం అందుకొక నిదర్శనం....

ఫ్లెక్సీలపై నిషేధం పర్యావరణ హితమా?

జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఒక్కో రంగాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీస్తోంది. తాజాగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం అందుకొక నిదర్శనం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలవనున్నది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవానికి కొద్ది రోజుల ముందు (ఆగస్టు 26న) విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిషేధ నిర్ణయాన్ని ప్రకటించారు. సదరు కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను కాన్వాయ్‌తో వస్తున్నప్పుడు రోడ్లపై ఫ్లెక్సీలను గమనించానని, కాలుష్య నియంత్రణ–పర్యావరణ పరిరక్షణ కోసం వాటిని నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటున్నట్లు అట్టహాసంగా ప్రకటించారు. ఫ్లెక్సీలకు బదులుగా కాటన్ ఫ్లెక్సీలు, నేత వస్త్రాలు వాడాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు విశాఖలో కట్టిన ఫ్లెక్సీలను ఆయన గమనించారేమో గానీ తక్షణమే ఈ నిర్ణయానికి వచ్చేశారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవంతో పాటు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కూడా. గ్రామాల్లో, పట్టణాల్లో పలుచోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీలు కట్టాలంటేనే భయపడేటట్లు చేశారు. వైకాపా శ్రేణులు రాజశేఖరరెడ్డి ఫ్లెక్సీలు మాత్రం ఆడంబరంగా అన్నీ చోట్ల కట్టారు.

కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి తెచ్చింది. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లు, గ్లాస్‌లు నిషేధించాలి కానీ రాష్ట్రంలో అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం ప్లాస్టిక్‌ కవర్‌లు వినియోగించే షాపులకు వర్తమానం నామమాత్రంగా పంపారంతే. ఫలితంగా నేడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వీటి నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి 350మైక్రాన్లకు పైగా ఉండే ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఫ్లెక్సీ షాపుల వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి మార్కెట్‌లో కడుతున్న ఫ్లెక్సీలు ప్లాస్టిక్‌ నిషేధిత జాబితాలోకి రావంటూ తయారీదారులు చెబుతున్నారు. వాటిని తిరిగి వినియోగించుకునే ప్లాస్టిక్‌గా పర్యావరణ శాఖ నిర్ధారించింది. ఇతర రాష్ర్టాల్లో ఇదేమాదిరిగా నిషేధం విధిస్తే అక్కడ తయారీదారులంతా పర్యావరణ సర్టిఫికేట్‌ లు తెచ్చుకొని, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించారు. ఎప్పటిలాగే ఫ్లెక్సీలు తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఫ్లెక్సీల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించాయి.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫ్లెక్సీలలో ప్లాస్టిక్‌ 9 శాతమే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లెక్సీల్లో అత్యధికంగా కాల్షియం కార్బొనేట్‌, అంటే సున్నం 36 శాతం, పునర్వినియోగానికి పూర్తిగా పనికివచ్చే పీవీసీ రెజిన్‌ 33 శాతం, పాలిస్టర్‌ వస్త్రం 18 శాతం, ప్లాస్టిక్‌ 9 శాతం, ఇతర రసాయన మిశ్రమాలు 4శాతం ఉంటాయంటున్నారు. వీటిలో 9 శాతంగా ఉన్న ప్లాస్టిక్‌ మినహా మిగిలినవన్నీ పునర్వినియోగానికి పనికి వచ్చేవని స్పష్టం చేస్తున్నాయి. మైక్రాన్ల రూపంలో చూసినా ఫ్లెక్సీ 350 మైక్రాన్లకంటే మందంగా ఉంటుందని, అలాంటి ఫ్లెక్సీలను నిషేధించడం అనాలోచిత నిర్ణయంగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు.

ప్రస్తుతం తయారవుతున్న ఫ్లెక్సీలపై అడుగుకు రూ.10 వ్యయం అవుతోంది. అదే గుడ్డతో తయారు చేయాలంటే రూ.35 వెచ్చించాలి. అది కూడా ప్రస్తుతం ఉన్న యంత్ర పరికరాలతో సాధ్యం కాదు. పరికరాలను మార్చుకోవాలి. కనిష్ఠంగా రూ.20 లక్షలు పెట్టుబడి అవసరం కానుంది. అంత పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టే పరిస్థితిలో తయారీదారులు లేరు. మరోవైపు గుడ్డతో తయారు చేస్తే ధర అధికమవుతుంది. ఇంత భారీ ఖర్చు భరించలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారులు బ్యానర్లు వేయించేందుకు ముందుకు రారు. పైగా వస్త్రం ఫ్లెక్సీ మన్నిక కూడా చాలా తక్కువ కావడం వల్ల వ్యాపారులు ఎవరూ బ్యానర్లు, హోర్డింగులు వేయించే అవకాశమే లేదు. ఇలా మొత్తంగా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది.

పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు ఇప్పటికే ఫ్లెక్సీల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి నవంబర్ 1 నుంచి ఎక్కడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కనబడకూడదని హుకుం జారీ చేశాయి. గతంలో ఎప్పటినుండో ఉన్నా ఫ్లెక్సీలు సైతం తీసివేయాలని లేకుంటే చర్యలు తప్పవని ప్రకటించాయి. నవంబర్ 1 నుంచి కొత్తవి అనుమతించమని అనడం సమంజసమే గానీ అంతకు ముందు నుండి ఉన్నవి కూడా ఎక్కడా కనిపించరాదని అనడం ఎంతవరకు సబబు? పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు హోర్డింగ్‌ల నుండి అధిక ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా హోర్డింగ్‌లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం వల్ల అవి ఏర్పాటు చేసిన సంస్థలకు, వ్యాపార సంస్థలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. తద్వారా పురపాలక సంఘాలకు కూడా ఆదాయం పడిపోతుంది. ఫ్లెక్సీలపై విధించే జరిమానాల ద్వారా ప్రభుత్వ ఖజనా నింపాలనే ఆలోచనతోనే ఫ్లెక్సీలను నిషేధించారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నాయకునిగా చేసిన ఓదార్పు యాత్ర, పాదయాత్రల్లో ప్రచారానికి అధికంగా వాడుకుంది ఈ ఫ్లెక్సీలనే. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల ప్రచారానికి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల ప్రచారానికి విశేషంగా ఫ్లెక్సీలను వినియోగిస్తున్నారు.

గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పర్యావరణంపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టేవారు. నీరు –చెట్టు, ఇంకుడు గుంతలు లాంటి కార్యక్రమాలను అధికారికంగా పెద్ద ఎత్తున చేపట్టేవారు. నాడు నాటిన మొక్కలలో అన్నీ బ్రతకకపోయినా కొన్ని అయినా నేడు చెట్లు అయ్యాయి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలించిన ఐదు సంవత్సరాల్లో అనావృష్టి, వర్షాలు ఆలస్యంగా పడటం తదితర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ పగ్గాలు చేపట్టిన తొలి సంవత్సరం కూడా సెప్టెంబర్ దాకా వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే లేవు అనుకుంటాము. కానీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పుడైనా ప్రతి చుక్కను ఒడిసిపట్టుకోవాలనే ముందుచూపు నేటి ప్రభుత్వానికి ఒకింత కూడా లేకపోవడం బాధాకారం.

ముఖ్యమంత్రికి నిజంగా పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి. నివారణ చర్యలు చేపట్టాలి. కానీ వాటన్నింటిని వదిలిపెట్టి ఫ్లెక్సీలను నిషేధించడం ఎంతవరకు సమంజసం? బాగా వాడుకలో ఉన్న ఒక వస్తువుని నిషేధించాలంటే అది ఒక క్రమపద్ధతిలో అంచెలంచెలుగా జరగాలి. అంతేగానీ ఉన్నపళంగా నిషేధం అంటే లాభం సంగతి అంటుంచి నష్టమే ఎక్కువ జరుగుతుంది. ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే మద్యాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామంటున్న ప్రభుత్వం, ఫ్లెక్సీలను మాత్రం ఉన్నపళంగా ఎందుకు నిషేధించాలి? ప్రభుత్వం తొలుత సర్కారీ మద్య దుకాణాల్లో ప్లాస్టిక్ బాటిల్స్‌లో మద్యాన్ని విక్రయించడం నిలిపివేయాలి. పట్టణాలలో, నగరాల్లో, గ్రామాల్లో భారీ ఎత్తున అధికార పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ముందుగా తొలగించాలి. పార్టీ కార్యాలయాల్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలి. నిజంగా సామాజిక శ్రేయస్సు, భద్రత దృష్ట్యా చిత్తశుద్ధితో తీసుకునే నిర్ణయాలు కాస్తా ఆలస్యంగానైనా తప్పకుండా జనామోదాన్ని పొందుతాయి. అంతేగానీ వ్యక్తిగత కక్షలతో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ జనామోదం పొందవు సరికదా, ప్రజా పోరాటాలకు దారితీస్తాయి.

తన్నీరు కళ్యాణ్ కుమార్

Updated Date - 2022-11-01T03:09:00+05:30 IST