Share News

INDIA bloc Varanasi: వారణాసిలో మోదీపై పోటీ.. ఇండియా కూటమి బిగ్ ప్లాన్..

ABN , Publish Date - Dec 20 , 2023 | 07:26 PM

వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్‌స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

INDIA bloc Varanasi: వారణాసిలో మోదీపై పోటీ.. ఇండియా కూటమి బిగ్ ప్లాన్..

న్యూఢిల్లీ: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్‌స్టార్ల జాబితాను విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం.


బీజేపీ కుంచుకోట..

వారణాసి బీజేపీకి కుంచుకోటగా చెబుతారు. 1991 నుంచి ప్రతి ఎన్నికలోనూ (2004లో మినహా) బీజేపీ ఇక్కడ గెలుస్తూ వస్తోంది. 2014, 2019లో మోదీ ఈ నియోజకవర్గం నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి 60 శాతానికి పైగా ఓట్లను మోదీ సొంతం చేసుకున్నారు. 1952 నుంచి ఓ దశాబ్దం పాటు వారణాసి కాంగ్రెస్ చేతిలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత గెలుపు దాదాపు ఎండమావే అయింది. ఈ నేపథ్యంలో ఈసారి మోదీపై గట్టి అభ్యర్థిని దింపడం ద్వారా టెంపుల్ టౌన్‌పై పట్టుసాధించాలని ఇండియా కూటమి భారీ వ్యూహరచన చేస్తోంది.


రెండు పేర్లు పరిశీలనలో...

వారణాసి నుంచి మోదీపై ఎవరు పోటీలోకి దిగాతారనే విషయంలో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీష్ కుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు తెరపైకి వచ్చాయి.


నితీష్ కుమార్..

ఒకప్పుడు బీజేపీకి భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ ప్రస్తుతం ఇండియా కూటమి వ్యవస్థాపక నేతల్లో ఒకరుగా ఉన్నారు. కూటమి ప్రధాన అభ్యర్థిగా ఆయన పేరు పలుమార్లు ప్రచారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా పీఎం అభ్యర్థిగా ఆయన పేరు వినిపించింది. కాగా, ఎన్డీయే కూటమి నాలుగో సమావేశానికి వారం రోజుల ముందు కూడా పీఎంగా నితీష్‌ను ఫోకస్ చేసే పోస్టర్లు పాట్నాలో వెలిసాయి. అయితే ఆ పోస్టర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ ప్రకటించింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదనకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు మొగ్గలోనే ఖర్గే కొట్టివేశారు. ఎన్నికల్లో గెలుపు తర్వాతే ఏ మాటైనా అంటూ ఆ ప్రస్తావనకు బ్రేక్ వేశారు. కూటమి సమావేశం పూర్తికాగానే నితీష్ కుమార్, బీహార్‌లో ఆయన భాగస్వామ్య పార్టీ ఆర్డేజే నేత లాలూ ప్రసాద్ యాదవ్ హుటాహుటిన అక్కడి నుంచి వెళ్లిపోయరు.


ప్రియాంక గాంధీ వాద్రా..

కాగా, ప్రియాంక గాంధీ వాద్రా ఇంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. అజయ్ రాయ్‌నే తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలబెట్టగా, మోదీ కంటే ఐదు లక్షల ఓట్ల వెనుకబడి మూడో స్థానానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. నాలుగేళ్ల క్రితం ప్రియాంక వాద్రా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బరిలోకి దిగుతానన్నారు. వారణాసి నుంచి పోటీ చేస్తారా అని అడిగినప్పడు ''వై నాట్'' అనే సమాధానమిచ్చారు. వారణాసి నుంచి వాద్రా నిలబడతారని ఈ ఏడాది మొదట్లో వినిపించినప్పుడు శివసేన (థాకరే వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్వాగతించారు. తన ఫ్రెండ్ (ప్రియాంక) వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పనిసరిగా గెలుస్తారని కూడా జోస్యం చెప్పారు.


మూడో ఆప్షన్..?

ఎన్డీయే కూటమి మూడో ఆప్షన్ కూడా ఉందని చెబుతారు. ఆయన మరెవరో కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి ఆయన పోటీ చేశారు. రెండు లక్షలకు పైగా ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. 20 శాతం ఓట్లు మాత్రమే ఆయన ఖాతాలో పడ్డాయి. ఇండియా కూటమి సైతం ఇప్పుడు సామాన్య వ్యక్తిని ప్రధానిపై పోటీకి దింపితే కష్టమనే విషయం గ్రహించినట్టు చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ విజయానికి బీజేపీ చేసిన పటిష్ట వ్యూహరచన దృష్ట్యా ఈసారి వారణాసి నుంచి కూటమి అభ్యర్థిగా స్టార్ కంటెండర్‌నే బరిలోకి దింపాలని అనుకుంటోంది. మూడు రాష్ట్రాల ఎన్నికలను మోదీ స్యయంగా భుజం మీద వేసుకోవడం, మోదీ ఫ్యాక్టర్ కూడా ఆ పార్టీకి కలిసిరావడాన్ని ఇండియా కూటమి సీరియస్‌గా పరిశీలిస్తోంది.

Updated Date - Dec 20 , 2023 | 07:26 PM