Share News

France: ఫ్రాన్స్ అధీనంలో ఉన్న విమానానికి లైన్ క్లియర్.. 303 మందితో తిరుగు ప్రయాణం

ABN , Publish Date - Dec 25 , 2023 | 09:49 AM

మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.

France: ఫ్రాన్స్ అధీనంలో ఉన్న విమానానికి లైన్ క్లియర్.. 303 మందితో తిరుగు ప్రయాణం

పారిస్: మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. అయితే ఫ్రెంచ్ విమానశ్రయం నుంచి తిరిగి బయలుదేరిన విమానం భారతదేశానికి చేరుకుంటుందా? లేక దుబాయ్ వెళ్తుందా? లేక నికరాగ్వాకు వెళ్తుందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 303 మంది ప్రయాణికులతో కూడిన విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. అయితే మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు సదరు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు.


వెంటనే స్పందించిన ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చించింది. ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం పారిస్‌కు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఈ ఘటనపై న్యాయ విచారణ జరిగింది. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ చేపట్టిన బహిరంగ విచారణ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని లెజెండ్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది స్పష్టం చేశారు. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన న్యాయమూర్తులు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందటూ మొత్తం కేసునే రద్దు చేశారు. విమానం బయలుదేరేందుకు అనుమతులు కూడా వచ్చాయి. దీంతో విమానం తిరిగి బయలుదేరింది. ప్రయాణికుల్లో 11 మైనర్లున్నారు. అయితే 10 మంది ఫ్రాన్స్‌లోనే ఉండేందుకు అభ్యర్థించినట్లు సమాచారం.

Updated Date - Dec 25 , 2023 | 09:49 AM