Share News

Karnataka: 'ఆపరేషన్ కమల్‌'కు బీజేపీ ప్రయత్నాలు!.. ఫలించదన్న సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2023-10-29T08:11:39+05:30 IST

కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్‌ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.

Karnataka: 'ఆపరేషన్ కమల్‌'కు బీజేపీ ప్రయత్నాలు!.. ఫలించదన్న సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్‌ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆ పార్టీ ప్రయత్నించిదని ఆరోపణలు చేశారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగేవారు కాదని.. అందుకే ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. బీజేపీతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ శాసనసభ్యులకు రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ చేసిన ఆరోపణలపై సిద్ధరామయ్యను ప్రశ్నించగా, “ఈ విషయం నాకు తెలియదు. ఆ ఎమ్మెల్యేతో నేను మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ(BJP) ఆపరేషన్ లోటస్ ప్రయత్నాలు ప్రారంభించిందనే సమాచారం నాకు ఉంది" అని అన్నారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) కూడా స్పందించారు.


ఆపరేషన్ లోటస్ పై తనకు కూడా స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు. అది విజయవంతం కాదని అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు.. ‘నాయకుడు, ఎజెండా లేని పార్టీ ప్రజా నిర్ణయాన్ని కాలరాసేందుకు కుట్రపన్నుతోంది. ఢిల్లీలోని వారి యజమానుల పర్యవేక్షణలో కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం నవ్వుతెప్పిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి కఠినమైన విధేయులు. ప్రజా సేవ చేయాలనే తపన వారికి ఎప్పటికీ ఉంటుంది’ అని వేణుగోపాల్ విమర్శించారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అంతర్గత తగాదాలు, కుమ్ములాటలను కాంగ్రెస్ అధిష్టానం సరిచేసుకోలేక ప్రతిపక్ష పార్టీని నిందిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ ఆరోపించారు. 'కాంగ్రెస్‌లోనే అంతర్గత పోరు ఉంది. ప్రత్యర్థి పార్టీని నిందించకుండా కాంగ్రెస్ నేతలు వారి పరిస్థితులు చక్కదిద్దుకోవాలి. వారికి భారీ మెజారిటీ ఉంది. మాకు(బీజేపీ) 66, జేడీఎస్‌కు 19 సీట్లు మాత్రమే ఉన్నాయి. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం కదా?’ అని నారాయణ్ అన్నారు.

Updated Date - 2023-10-29T08:11:55+05:30 IST