2024 Lok Sabha Elections : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే ఫార్ములా ఇదే : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2023-06-17T15:46:36+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఓ ప్రత్యేక ఫార్ములాను రూపొందించారు.

2024 Lok Sabha Elections : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే ఫార్ములా ఇదే : అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav

లక్నో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఓ ప్రత్యేక ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములాతో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చునని గట్టిగా చెప్తున్నారు.

ఎన్‌డీటీవీ లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిపక్షాల మహా కూటమిపై అడిగిన ప్రశ్నలకు అఖిలేశ్ యాదవ్ బదులిస్తూ, వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను ఓడించవచ్చునని తెలిపారు. ‘‘డిఫీట్ 80, రిమూవ్ బీజేపీ’’ అనేది ఉత్తర ప్రదేశ్‌లో తన ఏకైక నినాదమని తెలిపారు. పెద్ద జాతీయ పార్టీలు తమకు మద్దతిస్తే, ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని (80) స్థానాల్లోనూ బీజేపీని ఓడించవచ్చునని చెప్పారు. కూటమిలోని ఏ పార్టీ ఏ రాష్ట్రంలో బలంగా ఉందో గుర్తించి, దానిని దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరగాలన్నారు. గతంలో కాంగ్రెస్, బీఎస్‌‌పీలతో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని యాదవ్ గుర్తు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎల్లప్పుడూ అత్యంత నిజాయితీగల భాగస్వామి అని చెప్పారు. తమ పార్టీ ఏ కూటమిలో ఉన్నా, తాము సీట్ల కోసం పోట్లాడినట్లు వార్తలు వినలేరన్నారు.

ఇదిలావుండగా, నితీశ్ కుమార్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 23న ప్రతిపక్షాల సమావేశం జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెరుగుతుండటంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగితే తనకు నష్టం జరగవచ్చునని బీజేపీ భయపడుతోందన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలు రావచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీస ఉమ్మడి కార్యక్రమంతో ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి రావాలని తాను కోరుతానని తెలిపారు. బీజేపీ పరిపాలించిన చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రజల తిరస్కరణకు గురైందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అధికార దాహంతో ఆ పార్టీ కూలదోసిందన్నారు. పాట్నాలో ఈ నెల 23న జరిగే ప్రతిపక్షాల సమావేశంలో తాను తన అభిప్రాయాలను వెల్లడిస్తానని చెప్పారు.

పాట్నాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి రాహుల్ గాంధీ, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో జూనియర్ భాగస్వామి హోదాను కాంగ్రెస్ అంగీకరిస్తుందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.

మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ ఎజెండాలో ముఖ్యమైన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరిలో జరగవలసి ఉందని, ఉమ్మడి పౌర స్మృతి కోసం చట్టం గురించి ఇటీవలే ప్రస్తావిస్తున్నారని, అందువల్ల ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు అవకాశం లేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Nitish Kumar : మాంఝీపై నితీశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

Updated Date - 2023-06-17T15:46:36+05:30 IST