Soldiers missing: భారీ వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

ABN , First Publish Date - 2023-10-04T10:06:03+05:30 IST

ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకూతలం అయింది. ఈ వర్షాల వల్ల వరదలు సంభవించడంతో 23 మంది భారత ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.

Soldiers missing: భారీ వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకూతలం అయింది. ఈ వర్షాల వల్ల వరదలు సంభవించడంతో 23 మంది భారత ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం గల్లంతైన సైనికుల ఆచూకీ కోసం భారీ అన్వేషణ ప్రారంభించినట్లు ఆర్మీ ప్రకటించింది. సిక్కింలో నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగింది. దీంతో వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కుండపోతం వర్షం కురవడంతో తీస్తా నది నీటిమట్లం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని కిందికి విడుదల చేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల వరకు పెరిగింది. ఫలితంగా అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలు సింగ్టామ్ సమీపంలోని బర్దాంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలపై ప్రభావం చూపాయి. దీంతో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. వాహనాలతోపాటే 23 మంది జవాన్లు గల్లంతైనట్లు ఈస్ట్రన్ కమాండ్ తమ ప్రకటనలో తెలిపింది.


గల్లంతైన జవాన్ల అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ వరదల కారణంగా మొత్తం 41 వాహనాలు నీటిలో మునిగిపోయినట్లు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం కూడా సరిగ్గా లేదు. దీంతో గల్లంతైన సిబ్బందిని గుర్తించడం కష్టంగా మారిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సిక్కింలో రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ఉప్పొంగడంతో తీస్తా నదిలో నీటి మట్టాలు పెరిగాయి. కాగా తీస్తా నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫ్రూట్ బ్రిడ్జి కుప్పకూలింది. సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి సైతం చాలా చోట్ల కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సిక్కిం ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. తీస్తా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ తెలిపారు.

Updated Date - 2023-10-04T10:24:25+05:30 IST