CBI oppositions: 14 విపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో షాక్!.. ఇంతకీ విషయం ఏంటంటే...

ABN , First Publish Date - 2023-04-05T17:40:13+05:30 IST

ప్రతిపక్ష నేతల అసమ్మతి గళాలను అణచివేసేందుకు ఈడీ (Enforcement Directorate), సీబీఐ (Central Bureau of Investigation) వంటి దర్యాప్తు

CBI oppositions: 14 విపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో షాక్!.. ఇంతకీ విషయం ఏంటంటే...
Supreme Court

న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేతల అసమ్మతి గళాలను అణచివేసేందుకు ఈడీ (Enforcement Directorate), సీబీఐ (Central Bureau of Investigation) వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించిన 14 ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో శరాఘాతం తగిలింది. సాధారణ పౌరులకు మించిన మినహాయింపులను రాజకీయ నేతలు కోరుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గంపగుత్తగా రాజకీయ నాయకులకు వర్తించే విధంగా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ పార్టీల పిటిషన్లపై విచారణ జరిపేందుకు నిరాకరించింది. కేవలం వ్యక్తిగత కేసుల్లో మాత్రమే విచారణ జరపవచ్చునని వివరించింది.

ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆరోపిస్తూ గత నెలలో 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, టీఎంసీ తదితర పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Justice DY Chandrachud), జస్టిస్ జేబీ పర్దీవాలా (Justice JB Pardiwala) డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపింది.

ధర్మాసనం ఎదుట సింఘ్వి వాదనలు వినిపిస్తూ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 14 రాజకీయ పార్టీలు ఏకం కావడం చెప్పుకోదగిన విషయమని తెలిపారు. సీబీఐ, ఈడీ నమోదు చేస్తున్న కేసుల్లో 95 శాతం కేసులు కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలపైనేనని తెలిపారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీబీఐ, ఈడీ కేసులు పెరిగాయన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎంపిక చేసుకుని, లక్ష్యం చేసుకుని దర్యాప్తు సంస్థలను మోహరిస్తున్నారని చెప్పారు. ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని గుర్తు చేశారు. అరెస్టు, రిమాండ్, బెయిలు కోసం సరైన మార్గదర్శకాలను జారీ చేయడమే దీనికి సమాధానమని చెప్పారు.

అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. నిర్దిష్టంగా ఏదైనా కేసును ప్రస్తావించాలని చెప్పింది. పిటిషనర్లు కోరినట్లుగా భావాత్మక ఆదేశాలను జారీ చేయడం సాధ్యం కాదని తెలిపింది. రాజకీయ నేతలకు సంబంధించిన కొన్ని గణాంకాల ఆధారంగా మార్గదర్శకాలను విధించలేమని తెలిపింది. సీబీఐ, ఈడీ కేసుల వల్ల ప్రతిపక్షాల వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలుగుతోందని రాజకీయ పార్టీలు వాదిస్తే, దానికి సమాధానం రాజకీయ రంగంలోనే ఉంటుందని, కోర్టుల్లో కాదని వివరించింది.

కోర్టు వ్యాఖ్యలతో ఈ పిటిషన్‌ను ప్రతిపక్షాలు ఉపసంహరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి :

Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Rahul Vs Scindia : రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింథియా మండిపాటు

Updated Date - 2023-04-05T17:40:13+05:30 IST