Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-05T13:08:06+05:30 IST

విమర్శాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకత కాదని భారత ప్రధాన న్యాయమూర్తి

Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court

న్యూఢిల్లీ : విమర్శాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకత కాదని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) చెప్పారు. మలయాళం వార్తా చానల్ మీడియావన్ (MediaOne)కు భద్రతపరమైన అనుమతులను మంజూరు చేయడానికి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. జాతీయ భద్రతకు ముప్పు అని గాలి కబుర్లు చెప్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖను దుయ్యబట్టారు.

ప్రజల హక్కులను నిరాకరించడానికి కారణంగా దేశ భద్రతను చూపించకూడదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. దీనిని ఈ కేసులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా నిర్లక్ష్యంగా చూపించిందని తెలిపింది. ప్రజల హక్కులను ప్రభావితం చేసే దర్యాప్తు నివేదికలను చూపించి, తప్పించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. పత్రికా రంగంపై అసమంజసమైన ఆంక్షలను రాజ్యం విధించకూడదని చెప్పింది. దీనివల్ల పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని, కఠోర వాస్తవాలను మాట్లాడటం, ప్రజలకు తెలియజేయడం పత్రికల కర్తవ్యమని తెలిపింది.

ప్రభుత్వ విధానాలపై మీడియావన్ చానల్‌కు విమర్శాత్మక అభిప్రాయాలు ఉండటాన్ని ప్రభుత్వ వ్యతిరేకతగా అభివర్ణించకూడదని పేర్కొంది. అటువంటి పద ప్రయోగం చేయడంలోనే పత్రికా రంగం తప్పనిసరిగా ప్రభుత్వానికి మద్దతివ్వాలనే భావం వ్యక్తమవుతోందని తెలిపింది.

మీడియావన్ టీవీ చానల్ ఢిల్లీ హింసాకాండను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2020లో అభ్యంతరం వ్యక్తం చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్, 1994 నిబంధనలను ఉల్లంఘించినందుకు 48 గంటలపాటు ఆ చానల్ ప్రసారాలను నిషేధించింది. 2022లో ఆ చానల్ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోవడంతో ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాలను చూపించింది, అయితే అందుకు తగిన వివరాలను వెల్లడించలేదు. ఆ చానల్ పెట్టుబడిదారుల్లో అత్యధికులు కేరళ చాప్టర్ జమాతే ఇస్లామీ సంస్థకు చెందినవారని, దానిని నిషేధించడానికి అది ఓ కారణం కావచ్చునని వార్తలు వచ్చాయి. ఆ చానల్ హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్ర ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసింది. 2022 ఫిబ్రవరిలో సింగిల్ జడ్జి ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. డివిజన్ బెంచ్ కూడా సమర్థించడంతో ఆ చానల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు గత ఏడాది ఆ చానల్‌ కార్యకలాపాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పులో ఆ చానల్‌పై నిషేధాన్ని రద్దు చేసింది. సమాచారాన్ని సీల్డ్ కవర్లో కోర్టులకు ఇవ్వడాన్ని విమర్శించింది. సీల్డ్ కవర్ విధానం వల్ల సహజ న్యాయ సూత్రాలకు విఘాతం కలుగుతోందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి :

Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

JDS Alliance MIM : జేడీఎస్‌తో ఎంఐఎం పొత్తు?

Updated Date - 2023-04-05T13:08:06+05:30 IST