Food: బిర్యానీలో బొద్దింకలు.. టిఫిన్లలో పురుగులు..! ఆచి చూచి తినకపోతే..!

ABN , First Publish Date - 2023-03-15T12:19:56+05:30 IST

వినియోగదారులను ఆకర్షించేలా.. రసాయన మిశ్రమాల వాడకం, వారం, పది రోజుల పాటు అదే నూనె (Oil)లో వేయించడం వంటివి ఇష్టారాజ్యంగా చేస్తున్నట్టు అప్పుడప్పుడు జీహెచ్‌ఎంసీ

Food: బిర్యానీలో బొద్దింకలు.. టిఫిన్లలో పురుగులు..! ఆచి చూచి తినకపోతే..!
ఆచి చూచి తినకపోతే..!

పానీయాల్లో రంగులు.. ఆహారంలో రసాయనాలు..

విచ్చలవిడిగా వినియోగం

బిర్యానీలో బొద్దింకలు.. టిఫిన్లలో పురుగులు..

అనారోగ్యం పాలవుతున్న ప్రజలు

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు వ్యాపారులు

జీహెచ్‌ఎంసీ తనిఖీలు అంతంతే

ఏఎస్‌రావునగర్‌లో ఫుడ్‌ పాయిజన్‌

ఆస్పత్రిలో చేరిన ఎనిమిది మంది

షవర్మ సెంటర్‌ అనుమతి రద్దు

  • ఏఎస్‌రావునగర్‌లోని ప్రొటీన్‌ అండ్‌ మోర్‌ షవర్మ సెంటర్‌లో ఆదివారం ఆహారం తిన్న ఎనిమిది మంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ సెంటర్‌ను తనిఖీ చేసిన జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.. అనుమతి రద్దు చేశారు. నమూనాలు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

  • పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో చాయ్‌లోనూ రంగుల పొడులు వాడుతున్నట్టు గుర్తించారు. ఇక ఆహార పదార్థాల విషయం సరే సరి. కూరగాయలు, డీప్‌ ఫ్రై చేసే వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాల్లోనూ రంగు వచ్చేలా రసాయన మిశ్రమాలు వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

  • శేరిలింగంపల్లిలో ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గబెడుతున్నట్టు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హోటల్‌లో నాలుగు రోజుల క్రితం బిర్యానీలో బొద్దింక వచ్చిందన్న ఫిర్యాదుతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నమూనాలు సేకరించారు.

పైవన్నీ గ్రేటర్‌లోని కొన్ని హోటళ్లు, పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన లభించే ఆహారం ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు నిదర్శనాలు.

హైదరాబాద్‌ సిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులను ఆకర్షించేలా.. రసాయన మిశ్రమాల వాడకం, వారం, పది రోజుల పాటు అదే నూనె (Oil)లో వేయించడం వంటివి ఇష్టారాజ్యంగా చేస్తున్నట్టు అప్పుడప్పుడు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు నిర్వహిస్తోన్న తనిఖీల సాక్షిగా బహిర్గతమవుతోంది. వంటకాల్లో నాణ్యతా రహిత పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. రంగు, రుచి కోసం ప్రమాణాలకు విరుద్ధంగా నిషేధిత పదార్థాలూ వాడుతున్నట్టు పలుచోట్ల తేలిందని ఓ అధికారి చెప్పారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక బిర్యానీలో బొద్దింకలు, టిఫిన్లలో పురుగులు వస్తున్నాయన్న ఫిర్యాదులు సాధారణమై పోయాయి. హోటళ్లు, వీధి వ్యాపారులు మాత్రమే కాదు.. కొన్ని చోట్ల కర్రీ పాయింట్లలోనూ రసాయన మిశ్రమాలు వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. రంగు కోసం చాయ్‌లోనూ పొడులు వాడుతున్నట్టు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలో అధికారులు గుర్తించారు.

అవగాహన ఎక్కడ..?

హోటళ్లు (Hotel), వీధి వ్యాపారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహార విక్రయంపై అవగాహన కల్పించేందుకు రెండు నెలల క్రితం ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ పేరిట మొబైల్‌ ల్యాబ్‌ (Mobile Lab)ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆహార చట్టం ప్రకారం వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రోజుకో సర్కిల్‌లో పర్యటించే వాహనం క్షేత్రస్థాయిలో నమూనాలను అక్కడికక్కడ పరిశీలించడంతోపాటు.. వ్యాపారులకు శుచి, శుభ్రతతో కూడిన ఆహారం అందించడం ఎలా అన్న దానిపై అవగాహన కల్పించాలి. నిత్యం ఒక సర్కిల్‌లో మొబైల్‌ ల్యాబ్‌తో పరీక్షలు చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. నిత్యం 20-30 నమూనాలు పరీక్షించాల్సి ఉన్నా.. అందులో మూడో వంతె టెస్ట్‌లూ జరగడం లేదని సంబంధిత అధికారులే అంగీకరిస్తున్నారు. దీంతో కల్తీ ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది.

పట్టని ఫుడ్‌ సేఫ్టీ..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా.. ప్రస్తుతం 20 మంది ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లున్నారు. ఒక్కో సర్కిల్‌కు ఒకరు ఉండాల్సి ఉన్నా.. ఉద్యోగుల కొరతతో కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తమ పరిధిలోని హోటళ్లను నిరంతరం తనిఖీ చేస్తూ వినియోగదారులకు సురక్షిత ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత వీరిది. ప్రతి నెలా కనీసం పది హోటళ్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపాలి. కానీ కొన్ని సర్కిళ్ల పరిధిలో అధికారులు రెండు, మూడు కంటే ఎక్కువ శాంపిల్స్‌ సేకరించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ల రాకతో పరిస్థితి మారి.. నగర పౌరులకు సురక్షిత ఆహారం అందుతుందని భావించినా.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. కల్తీ పదార్థాల విక్రయం క్రమేణా పెరుగుతోంది. కొన్ని ఫ్రైడ్‌ చికెన్‌ (Chicken) విక్రయ సంస్థల్లోనూ అనారోగ్యకర ఆహారం వినియోగదారులకు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఏపీలోని ఓ ఫ్రైడ్‌ చికెన్‌ సెంటర్‌లో నూనె మార్చకుండా రోజుల తరబడి వినియోగిస్తున్నట్టు గుర్తించారు. నూనెలో సాధారణంగా టోటల్‌ పొలార్‌ కాంపౌండ్‌ (టీపీసీ) కౌంట్‌ 25 లోపు ఉండల్సి ఉండగా.. ఏపీలో 38 శాతం దాటినట్టు గుర్తించారు. నగరంలోనూ మెజార్టీ హోటళ్లు, వీధి వ్యాపారులు నూనెను రోజుల తరబడి మరగబెడుతుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో కేన్సర్‌, గ్యాస్ర్టిక్‌, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా, ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Updated Date - 2023-03-15T12:19:56+05:30 IST