TSPSC Special: ఆర్టికల్‌ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి వివరణ..

ABN , First Publish Date - 2023-03-08T12:48:36+05:30 IST

దేశంలో (India) తీవ్ర సంక్షోభం(ఆర్థిక సంక్షోభం) ఏర్పడిందని కానీ, దేశ ఆర్థిక స్థిరత్వం లోపించిందని కానీ, దేశ రుణగ్రస్థత పెరిగిందని కానీ రాష్ట్రపతి (President) భావించినప్పుడు ఆర్థిక

TSPSC Special: ఆర్టికల్‌ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి వివరణ..
పోటీ పరీక్షల కోసం

రాష్ట్రపతి

దేశంలో (India) తీవ్ర సంక్షోభం(ఆర్థిక సంక్షోభం) ఏర్పడిందని కానీ, దేశ ఆర్థిక స్థిరత్వం లోపించిందని కానీ, దేశ రుణగ్రస్థత పెరిగిందని కానీ రాష్ట్రపతి (President) భావించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు. రాష్ట్రపతి ప్రకటనను రెండు నెలల్లోగా సాధారణ మెజారిటీతో పార్లమెంటు (Parliament) ఆమోదించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితిపై న్యాయసమీక్ష చేయవచ్చు.

పార్లమెంటు ఆమోదం: ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. లోక్‌సభ రద్దయిన సందర్భంలో విధిస్తే ముందుగా దానిని రాజ్యసభ ఆమోదించాలి. లోక్‌సభ పునః సమావేశమైన 30 రోజుల్లోగా దానిని ఆమోదించాలి.

కాలపరిమితి: ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించిన తరవాత ఉపసంహరించే వరకూ కొనసాగుతుంది. దీనిని బట్టి రెండు అంశాలను అవగాహన చేసుకోవచ్చు.

1. పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఒకసారి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆమోదిస్తే నిరవధికంగా అమలులో ఉంటుంది. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు.

2. ప్రతి ‘ఆరు’ నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదించాల్సిన అవసరం లేదు.

జూ ఇప్పటివరకు భారత్‌లో ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు.

ఉపసంహరణ: ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఉపసంహరించవచ్చు. దీనికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు.

ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రభావం

  • కేంద్రం రాష్ట్రాలకు పొదుపు చర్యలు పాటించాలని మార్గదర్శకాలు సూచించవచ్చు.

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గించాలని సూచించవచ్చు.

  • రాష్ట్రాల ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ప్రవేశపెట్టమని సూచించవచ్చు.

  • రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలతో సహా అందరి వేతనాలను తగ్గించవచ్చు.

  • ఆర్థిక అత్యవసర పరిస్థితి వలన రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్‌.ఎం.కుంజ్రు భావించారు. దానికి సమాధానంగా డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి వ్యాఖ్యానించారు. 1933లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘నేషనల్‌ రికవరీ యాక్ట్‌’తో దీనిని పోల్చవచ్చు అని చెబుతూ... ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థమంతంగా ఎదుర్కోవడానికే ‘ఆర్టికల్‌-360’ని రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు.

అత్యవసర అధికారాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలు

  • ‘అసాధారణ పరిస్థితుల్లో ఈ అత్యవసర అధికారాలు రాజ్యాంగానికి ఒక కవచం వంటివి’. - మహావీర్‌ త్యాగి.

  • ‘ఆర్టికల్‌-356 రాష్ట్రాల తలలపై వేలాడే కేంద్రం కత్తి.. అంటే ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా వధించవచ్చును’ - డి.కె.చటర్జీ

  • ‘అత్యవసర అధికారాల వలన రాష్ట్రపతి రాజ్యాంగపరమైన నియంతగా వ్యవహరించవచ్చు’ - టి.టి.కృష్ణమాచారి.

  • ‘రాష్ట్రపతి పాలన అనేది కేంద్రప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలాటగా మారింది. గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్రం పాలువుగా మారారు’. -వి.ఆర్‌.కృష్ణయ్యర్‌.

  • ‘రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రాలపై సర్వ అధికారాలు ఇవ్వడం అనేది ఆశ్చర్యకరమైనది. అత్యవసర అధికారాలు మనదేశంలో అధికారయుత, నియంతృత్వ రాజ్యస్థాపనకు తోడ్పడేవిగా ఉన్నవి’ - కె.టి.షా.

  • ‘ఒకవేళ రాష్ట్రపతి ఈ అధికారాలను నిజంగా ఉపయోగిస్తే ఆ రోజు ఒక అవమానకర, బాధాకరమైన రోజు అవుతుంది. అత్యవసర అధికారాలను ఉపయోగించి నెలకొల్పే శాంతి స్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది’. - హెచ్‌.వి.కామత్‌.

  • ‘అత్యవసర అధికారాలు, భారత రాజ్యాంగానికి శ్వాసనందించే మార్గాలు’. - అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్‌.

  • ‘రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితులు అవసరమైన చెడు’ - టి.టి.కృష్ణమాచారి.

  • ‘ఆర్టికల్‌-356, రాష్ట్ర ప్రభుత్వాల రద్దు వంటి అంశాలు మన సమాఖ్య వ్యవస్థకు చేటు తెచ్చేవి’ - పండిట్‌ హృదయనాథ్‌ కుంజ్రూ.

  • ‘అత్యవసర అధికారాలు రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రపతిని నియంతగా మార్చే ప్రమాదమున్నది’ - అలెన్‌ గ్లేడ్‌హీల్‌

  • ‘అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపై జరిగే దోపిడీ వంటివి’ - కె.ఎం.నంబియార్‌.

రాష్ట్రపతి పదవిపై ప్రముఖుల వ్యాఖ్యానాలు

  • రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యత, సమగ్రతలకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యపాత్రను పోషిస్తారు.

    - సర్వేపల్లి రాధాకృష్ణన్‌.

  • భారత్‌ పార్లమెంటరీ విధానం అనుసరిస్తున్నందున ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే వ్యవహరించే రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి.

    - డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌.

  • భారత రాష్ట్రపతులందరూ ప్రధానమంత్రి యొక్క రాష్ట్రపతులుగానే భావించాలి. - టి.ఎన్‌.శేషన్‌.

  • 42, 44వ రాజ్యాంగ సవరణల తరవాత రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలిపోయింది.

    - ఎం.పి.జైన్‌

  • రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రునిగా, మార్గదర్శకుడిగా, తాత్వికుడిగా వ్యవహరిస్తారు.

    - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌.

  • రాష్ట్రపతికి మన రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలను వినియోగించడం పైనే వారి స్థానం, ప్రాముఖ్యం ఆధారపడి ఉంటుంది. - ఎం.వి.పైలీ.

  • భారత రాష్ట్రపతి కొన్ని ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటాడు. రాజ్యాంగ పరిరక్షకునిగా అవసరమైనప్పుడు తన విచక్షణను అనుసరించి నిర్వర్తిస్తాడు.

    - కె.సంతానం.

-వి.చైతన్యదేవ్‌, సీనియర్‌ ఫ్యాకల్టీ

d;d;.jpg

ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!

Updated Date - 2023-03-08T12:48:36+05:30 IST