India Politics: తడబాటులో తప్పుల మీద తప్పులు! భవిష్యత్‌లో జరిగే నష్టమిదేనా?

ABN , First Publish Date - 2023-10-05T03:11:14+05:30 IST

ఎదురులేని అధికారానికి అహంకారం తోడైనప్పుడు, ఆలోచన పట్టు తప్పుతుంది. పతనం మొదలై తడబడుతున్నప్పుడు కూడా ఆ తూగుకు ప్రయాణం గతి తప్పుతుంది. ఏ స్థితిలో ఉన్నారో కానీ...

India Politics: తడబాటులో తప్పుల మీద తప్పులు! భవిష్యత్‌లో జరిగే నష్టమిదేనా?

ఎదురులేని అధికారానికి అహంకారం తోడైనప్పుడు, ఆలోచన పట్టు తప్పుతుంది. పతనం మొదలై తడబడుతున్నప్పుడు కూడా ఆ తూగుకు ప్రయాణం గతి తప్పుతుంది. ఏ స్థితిలో ఉన్నారో కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మధ్య తరచు తప్పుల్లో కాలువేస్తున్నారు. వేయి చెవులూ లక్ష కళ్లూ అయి ప్రభుత్వం మీద, పాలన మీద జనస్పందనలను ప్రధానికి బోధపరచవలసిన వ్యక్తులూ శక్తులూ ఆ పని సరిగా చేస్తున్నట్టు లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను, బలపడుతున్న అల్పపీడనాలను ఖాతరు చేయకుండా అతిగా అంచనాలను అందిస్తున్నారు. చేస్తూ వచ్చిన చెడుగులనే పదింతలు చేయమని ప్రోత్సహిస్తున్నారు.

దర్యాప్తు సంస్థలు, పోలీసుశాఖ చేసే మూకుమ్మడి దాడులు, సోదాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. జనసంచలనాల మీద నిఘా వేసే రాడార్ పరిధి విస్తరించింది. ఇతర రాజకీయ పార్టీలను, ఉద్యమసంఘాలను, పత్రికాస్వేచ్ఛను అదుపు చేయడానికి గడచిన పదేళ్లుగా అనుసరిస్తున్న పద్ధతులనే, మరింత తీవ్రంగా, కఠినంగా అనుసరించడం, నాలుగడుగులు ముందుకు వేసి మీడియా సంస్థను మూసివేయించి పాత్రికేయులను కూడా ఊపా కింద అరెస్టు చేయడం చూస్తుంటే, యాభై ఏళ్ల నాటి ఎమర్జెన్సీని ఉదహరించడం ఇక అనవసరం అనిపిస్తోంది. ప్రజాపక్షపాతంతో ఉద్యమకథనాలను, విధాన విమర్శలను రాసే మీడియా సంస్థలను, పాత్రికేయులను టెర్రరిస్టులుగా చిత్రించే రోజులు రావడం అంటే, పెరిగి పెరిగిన నిర్బంధపాలన విరిగిపోయే దశ వచ్చినట్టే కదా? జనం ఏమనుకుంటున్నారో కొద్దిగా గ్రహించగలిగితే, భిన్నంగా వ్యవహరించడానికి ప్రయత్నించేవారేమో అని అనిపిస్తుంది కానీ, కర్కశమైన, నిరంకుశమైన తీరులో తప్ప మరో విధంగా అడుగులు వేయలేని వ్యసనస్థితికి కేంద్రప్రభుత్వం చేరుకున్నది. రానున్న రోజులలో ఇంకా ఇంకా ఇటువంటివి జరుగుతాయి. ప్రజల తరఫున, ప్రజల కోసం వ్యవహరించేవారందరి ఇళ్లకు పలకరింపులు ప్రవహిస్తాయి.

మతపరమైన ఉద్వేగాలు మునుపటివలె భగ్గుమనడం లేదు. యాదృచ్ఛికంగానో ప్రయత్నపూర్వకంగానో సంఘటనలు జరిగినా, వాటిని సర్దుబాటు చేసే, వ్యాప్తికి విముఖత చూపే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. కేంద్ర పాలకుల మీద మునుపు ఉండిన ఆరాధన తగ్గిపోయి, విమర్శనాత్మక దృష్టి పెరుగుతున్నది. ఆర్థికమైనవి కానీ, ఉద్యమాలకు సంబంధించినవి కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న అభియోగాలు దురుద్దేశాలతో, పక్షపాతంతో కూడినవని జనానికి అర్థమవుతున్నది. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు నెరవేరలేదని, ప్రచారార్భాటానికి వాస్తవ ఆచరణకూ పొంతనలేదని గ్రహింపు పెరుగుతున్నది. అన్నిటికంటె మించి, సామాజిక మాధ్యమాలలో ఉన్మాదుల సంఖ్య తగ్గకపోయినా, వివేకవంతుల స్వరంలో ధైర్యం, నిశ్చయం పెరిగాయి. గాలిమార్పు స్పష్టంగా తెలుస్తోంది. వెనువెంటనే వస్తుందని కాదు కానీ, మార్పు కష్టం కాదన్న నమ్మకం కనిపిస్తోంది.

స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్పు అధికార పీఠాలు ఎందుకు చూడలేవు?

****

త్వరలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ బీజేపీ అంతో ఇంతో మెరుగు. ఆ మధ్య కొంతకాలం, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనన్న అభిప్రాయం కూడా కలిగింది. వెనుకడుగు వేసి బీజేపీ తనను తాను తగ్గించుకోవాలనుకోవడంలో ఉన్న తర్కం అర్థం చేసుకోవచ్చు. తాము స్వయంగా గెలవడం సాధ్యం కానప్పుడు, ప్రధాన శత్రువు గెలవకుండా చూడడం ప్రాధాన్యం అవుతుంది. అయితే ఆ ఉపసంహరణ ప్రక్రియ హాస్యాస్పదంగా మారకూడదు.

ఉద్దేశం ఏదైనా, పైకి మాత్రం తాము తెలంగాణలో గెలిచి అధికారంలోకి వస్తామనే బీజేపీ చెబుతున్నది. అటువంటి ప్రకటిత లక్ష్యం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన గురించి తెలంగాణ ఉద్యమ మనోభావాలను నొప్పించే వ్యాఖ్యలను సాక్షాత్తూ ప్రధాని ఎందుకు చేయాలి? పోనీ, ఆ మాటల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ప్రయోజనం లభిస్తుందనుకోవడానికి అక్కడ పార్టీకి ఠికానాయే లేదు. పైగా, ఆంధ్ర ప్రజలు కూడా విభజన గాయాలను గుర్తు చేసుకోవడానికి ఆసక్తితో లేరు. అనంతరం ఎదురైన కేంద్ర ప్రభుత్వ వాగ్దాన భంగాల వల్ల, ప్రస్తుత పాలనలో రాజధాని అనిశ్చితత్వం వల్ల వారు ఎక్కువగా గాయపడి ఉన్నారు. ఎందుకు అటువంటి వ్యాఖ్యలు మోదీ చేయాలి? ఎవరు ఆయనకు ప్రాంప్టింగ్ ఇచ్చేది?

కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ సమానంగా బీఆర్ఎస్‌తో పోటీ పడుతుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్‌కు లబ్ధి కలుగుతుంది. కానీ, కర్ణాటక ఫలితం తరువాత, పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పుంజుకుంది. దానికితోడు, బీజేపీ పార్టీపరంగా హఠాత్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణలో క్రియాశీలమైన నాయకత్వాన్ని తప్పించింది. నిజం దేవుడికి తెలుసు కానీ, బీఆర్ఎస్ బీజేపీది లాలూచీ కుస్తీయేనని, వాగ్యుద్ధాలు మొదలైన మొదటి నుంచి కొందరు అనుమానపడ్డారు. తరువాత తరువాత ఆ అనుమానం నమ్మకంగా మారింది. ఫలితంగా, ప్రస్తుతం తెలంగాణలో పోటీ పడుతున్న ప్రధానపక్షాలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే కనిపించేంతగా పరిస్థితి మారింది!

కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలంటే, బీజేపీ, బీఆర్ఎస్ కాసేపు కత్తులు దూసుకోవాలి, నిజమైన యుద్ధమే అనిపించేంత హడావిడి చేయాలి. అటకెక్కించిన తీవ్రవిమర్శలను దుమ్ము దులపాలి. ఈడీలు సీబీఐలు రంగంలోకి దిగాలి. అవేవీ జరగకుండా, వైరిపక్షాలమంటే ఎవరు నమ్ముతారు? ఇటువంటి స్థితిలో నరేంద్రమోదీ నిజామాబాద్‌లో అప్పుడెప్పుడో తనకూ కేసీఆర్‌కూ జరిగిన భేటీకి సంబంధించిన నిజాలను కుండబద్దలు కొట్టడం అవసరమా? ఆ సంభాషణ సమాచారం కొత్తదేమీ కాదు. ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానమంత్రిని హరిశ్చంద్రమూర్తి, సత్యమూర్తి అని భావించలేము కానీ, ఈ సందర్భంలో ప్రధాని చెప్పింది అసత్యం కాదు కానీ, చేసింది మాత్రం తెలివితక్కువపని. ఆయన ఆ సంభాషణను వెల్లడి చేయడం వల్ల బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న అభిప్రాయానికి బలం పెరిగి, కాంగ్రెస్ అవకాశాలకు లబ్ధి చేకూరింది. ఈ మాటలు మాట్లాడమని ఎవరు ఫీడింగ్ ఇచ్చారో? లేక, ప్రధాని మోదీ స్వయంకృతమా?


కొడుకుకు అధికారం అప్పచెబుతానని ప్రస్తావవశంగా కేసీఆర్ మోదీకి చెప్పి ఉంటారు. అనుమతి కోసం కాకపోవచ్చును కానీ, సాఫీ ప్రక్రియ కోసం సహకారం అడుగుతున్నట్టుగా మాట్లాడి ఉంటారు. అది సరే, కుమారుడికి పార్టీని, ప్రభుత్వాన్ని అప్పజెప్పాలనుకునే ఉద్దేశ్యాన్ని కేసీఆర్ ఎప్పుడూ దాచుకోలేదు. అదేదో తప్పని కూడా ఆయన అనుకోరు. వారసత్వ రాజకీయాలకు, కుటుంబ పాలనకు వ్యతిరేకిని కాబట్టి, తాను కేసీఆర్‌తో విభేదించి, ఎన్‌డీఏలో చేరడానికి అనుమతించలేదన్నట్టుగా మోదీ చెప్పడం కొద్దిగా శ్రుతిమించిన అతిశయం. రాష్ట్రాలలో బీజేపీ అనేక రాజకీయ కుటుంబాలను, వారసత్వాలను ప్రోత్సహిస్తున్నది, కేంద్రకేబినెట్‌లోనూ వారసులు కనిపిస్తూనే ఉన్నారు. ఆ అంశం మీద కాకుండా, ఎంఐఎంతో తెగదెంపులు చేసుకుంటేనే ఎన్‌డీఏలోకి తీసుకుంటామని తాను అన్నట్టు చెప్పి ఉంటే రాజకీయంగా లబ్ధి కలిగేది. తుక్కుగూడ కాంగ్రెస్ సభ తరువాత ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య రాజకీయ సంవాదం పెరిగింది. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒకటే అన్న రాహుల్ విమర్శను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొనసాగిస్తున్నారు. అది అంతిమంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రయోజనాలకు భంగకరం. తెలంగాణ ముస్లింలు అంతా కాకున్నా, గణనీయమైన భాగం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మళ్లినా ఫలితాల మీద పెద్ద ప్రభావం ఉంటుంది.

తానోడి, మరొకరిని గెలిపించాలన్న ప్రయత్నంలో, బీజేపీ తన జాతీయ ప్రత్యర్థికి అయాచిత సాయం చేసింది!

చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ వైఖరి తెలివితక్కువదో కాదో మున్ముందు తేలుతుంది. తన కుమారుడికి వారసత్వం అప్పగించడానికి ప్రధాని అనుమతి అవసరం లేకపోవచ్చును కానీ, ఆశీస్సులు అవసరం అని కేసీఆర్ అనుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయం కావచ్చును కానీ, కేంద్రం అర్ధాంగీకారమైనా అవసరం. ఎందుకు బీజేపీ అధినాయకత్వం అందుకు తల వూపిందో, అధికార, ప్రతిపక్షాలలో ఎవరికి మేలు చేకూర్చాలని చేసిందో, ఆ రాష్ట్రంలో నామమాత్రమైన తన ఉనికికి ఏ లబ్ధి చేకూరుతుందని భావించిందో తెలియదు. రెండు పక్షాలూ తనతో సానుకూలంగానే ఉన్నప్పుడు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి అనుకూలంగా వైఖరి తీసుకోవడంలో హేతువేమిటి? దీర్ఘకాలం చంద్రబాబు నిర్బంధం క్షేత్రస్థాయిలో కలిగించే ప్రభావాలను బీజేపీ ఊహించలేకపోయిందా?

తెలంగాణ, తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుగాలి వీస్తున్నదని వెల్లడయితే అప్పుడు బీజేపీకి అనేక స్నేహాలు అవసరం అవుతాయి. అధికార ఉధృతిలో ప్రస్తుతం అనుసరించిన పద్ధతులు రేపు మైత్రికి అవరోధంగా మారతాయి. ప్రాంతీయ పార్టీలతో దాగుడుమూతలాడుతూ, మిత్రభేదాలను ప్రయోగిస్తూ విసిరే పాచికలు అన్ని వేళలా పారవు!

de.jpg

కె. శ్రీనివాస్

Updated Date - 2023-10-05T10:52:16+05:30 IST