Atchannaidu: మాజీ మంత్రిని ఇంతలా అవమానిస్తారా?.. ఇది దళిత జాతికి అవమానం

ABN , First Publish Date - 2023-02-18T10:52:11+05:30 IST

టీడీపీ నేత కె.యస్ జవహర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: మాజీ మంత్రిని ఇంతలా అవమానిస్తారా?.. ఇది దళిత జాతికి అవమానం

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి కె.యస్ జవహర్ (TDP Leader KS Jawahar) పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP State President Atchannaidu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రిని పోలీస్‌స్టేషన్లో నేలపై కూర్చోబెట్టి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. దళితులంటే జగన్ (AP CM YS Jagan Reddy) కి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. తమ పాలనలో దళితులు కనీసం కుర్చీపై కూర్చోవడానికి కూడా అర్హులు కాదా అని నిలదీశారు. జగన్ వైసీపీ దళిత నేతలను తన ఇంటి గుమ్మం బయట నిలబెడుతున్నారని, టీడీపీ దళిత నేతలను పోలీసు స్టేషన్లలో నేలపై కూర్చోబెడుతున్నారని విమర్శించారు. ఇది యావత్ దళిత జాతికి అవమానమన్నారు. జవహర్‌ (Rormer Minister)ను అవమానించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే...

కాగా.. మాజీ మంత్రి జవహర్‌కు తూర్పుగోదావరి జిల్లా (East Godavari District)లో తీవ్ర అవమానం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) జిల్లా పర్యటనలో జవహర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పర్యటన (Chandrababu Tour)ను పోలీసులు (AP Police) అడ్డుకునేందుకు యత్నించగా.. జవహర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలు తరలించారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయనను జైల్లో నేలపై కూర్చోబెట్టి అవమానించారు. జవహర్‌కు జరిగిన అవమానంపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బలభద్రపురంలో చంద్రబాబు కాన్వాయ్‌ (Chandrababu Convoy)ను పోలీసులు అడ్డుకుని.. రోడ్డుకు అడ్డంగా పోలీసులు కూర్చున్నారు. దీంతో చంద్రబాబు కారు దిగి కాలినడకన అనపర్తి బయలుదేరి వెళ్లారు. అయితే బాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించారు. రోడ్లపై లారీలు, బస్సులు, వ్యాన్లను నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. రోడ్లపై నుంచి వాహనాలు తీస్తారా లేదా అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇది పోలీసుల రాజ్యం కూడా కాదు రౌడీరాజ్యమన్నారు. జగన్‌రెడ్డి (Jagan Reddy) ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు.రౌడీరాజ్యం అంతం చేసేందుకు ఇదే కౌంట్‌డౌన్‌ అని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు.

Updated Date - 2023-02-18T11:26:54+05:30 IST